బాహు బలంన్యూస్ హుజూరాబాద్,అక్టోబర్ 14:
కుల, మతాలతో సంబంధం లేకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ‘ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కమిటీ’ నియోజకవర్గ అధ్యక్షుడు పోరెడ్డి శంతన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ… అవకాశాలు దక్కక అన్ని వర్గాలలోని పేద కుటుంబాల బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కులమతాలకు అతీతంగా తల్లులంతా ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ… తాము ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని, పేదలందరికీ సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కేంద్రం చట్టబద్ధ కమిషన్ వేసి సమగ్ర అధ్యయనం జరపాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా చేపట్టిన రథయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 26న సాయంత్రం పరకాలలో 50 వేల మందితో నిర్వహించే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం సభా ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు సంధి తిరుపతి రెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ఎడవల్లి కొండాల్ రెడ్డి, విష్ణుదాసు గోపాలరావు, తాటిపల్లి రాజన్న, రావుల కిరణ్ రెడ్డి, వర్ధినేని రవీందర్ రావు, బచ్చు ఆనందం తదితరులు పాల్గొన్నారు.









