బాహు బలంన్యూస్ హుజూరాబాద్, :
కుల, మతాలతో సంబంధం లేకుండా సమాజంలోని ప్రతి పేదవాడి ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని బలంగా డిమాండ్ చేశారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ‘ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కో-ఆర్డినేషన్ కమిటీ’ నియోజకవర్గ అధ్యక్షుడు పోరెడ్డి శంతన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసీ ఐకాస, వివిధ సామాజిక వర్గాల నేతలతో విస్తృత స్థాయి సదస్సు నిర్వహించారు.
పేదరికమే ప్రామాణికం కావాలి: పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి.
సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఓసీ జేఏసీ అగ్రనేతలు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలు ముఖ్య ప్రసంగం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కీలక డిమాండ్లను తెచ్చారు:
అన్ని వర్గాల పేదలకే న్యాయం: “మేం ఏ ఒక్క కులానికో, మతానికో వ్యతిరేకం కాదు. అన్ని సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు సమాన అవకాశాలు, సమన్యాయం దక్కాలన్నదే మా ఏకైక ధ్యేయం.”
క్రీమీలేయర్ లోపాల సవరణ: ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానంలో క్రీమీలేయర్ నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంతో ఇప్పటికే లబ్ధి పొందిన సంపన్న కుటుంబాలకే అవకాశాలు దక్కుతున్నాయని, అర్హులైన నిరుపేదలు వెనుకబడిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈడబ్ల్యూఎస్ తరహాలోనే సమగ్ర విధానం: ఓసీ వర్గాలలోని పేదలకు ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు కల్పించినట్లే, అన్ని కులాలు, వర్గాల్లోని నిరుపేదలందరికీ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించే సమగ్ర విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
చట్టబద్ధ కమిషన్ – రాజ్యాంగ సవరణ: దేశంలోని అన్ని సామాజిక వర్గాల ఆర్థిక పరిస్థితులపై లోతైన అధ్యయనం జరపడానికి వెంటనే చట్టబద్ధ కమిషన్ను నియమించాలని, అవసరమైతే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
26న పరకాలలో 50 వేల మందితో మహాసభ
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ఢిల్లీలోని రాజ్ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నేతలు తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 24న ఆదిలాబాద్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించి, 26న జనగామ, హనుమకొండ మీదుగా సాయంత్రం 4 గంటలకు పరకాల చేరుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా 26న సాయంత్రం 5 గంటలకు పరకాలలో రాజకీయాలకతీతంగా 50 వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పోరెడ్డి శంతన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యమ బహిరంగ సభ ప్రచార గోడపత్రికలను పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు.
సదస్సులో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సంధి తిరుపతి రెడ్డి, ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ఎడవల్లి కొండాల్ రెడ్డి, ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ విష్ణుదాసు గోపాలరావు, ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘాల నేత తాటిపల్లి రాజన్న, సోషల్ మీడియా కన్వీనర్ రావుల కిరణ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్ రావు, వెంకట్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, బీసీ సంఘాల రాష్ట్ర కార్యదర్శి బచ్చు ఆనందం, దళిత సంఘాల డివిజన్ నేతలు వేల్పుల రత్నం, బత్తుల రాయలింగులతో పాటు కంకనాల జనార్దన్ రెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, బజాజ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










