హైదరాబాద్ బాహు బలంన్యూస్ నవంబర్ 25::
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పి, యావత్ తెలంగాణ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన అపూర్వ ఘట్టం ‘దీక్షా దివస్’ అని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని అన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పోరాట పటిమ, మొక్కవోని పట్టుదలతో స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, అన్ని వర్గాల ప్రజలు ఏకమై ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైందని గుర్తు చేశారు. ఆ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించి, యావత్ తెలంగాణ ప్రజల బలీయమైన ఆకాంక్షను దేశం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా వివిధ మార్గాల్లో అనేక జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఎక్కడా తగ్గకుండా పోరాడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
పార్టీలకు అతీతంగా రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు:
అహింస, శాంతియుత మార్గంలో జరిగిన మహోన్నత ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రామారావు తెలిపారు. స్వరాష్ట్ర తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని, అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అందుకే నవంబర్ 29 ‘దీక్షా దివస్’ను యాదిలో ఉంచుకోవాలని, దీని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 29న పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్దేశించిన కో-ఆర్డినేటర్ల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, కామారెడ్డి, నిర్మల్, వరంగల్, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, కొత్తగూడెం కేంద్రాల్లో నాయకులచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, అమరవీరుల స్తూపాల వద్ద ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు వివరించారు. అలాగే, తెలంగాణ అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వం వారికి తగిన రీతిలో సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











