బాహు బలంన్యూస్ హుజూరాబాద్,నవంబర్, 07:
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుజూరాబాద్ ఆర్డీవో జలకుమారి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో సునీత స్పష్టం చేశారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు’ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారుల నివాసాల్లో స్థానికులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో జలకుమారి, మండల స్థాయి అధికారులు మాట్లాడుతూ.. గతంలో అద్దె ఇళ్లలో అరకొర వసతుల మధ్య దీపావళి జరుపుకొన్న నిరుపేదలకు నేడు పక్కా ఇళ్లతో ఆత్మగౌరవంతో కూడిన భరోసా లభించిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ గూడు కల్పిస్తామని, గ్రామ సమగ్రాభివృద్ధికి అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులు తాడూరి అరుణ-కోటేశ్వర్, నిమ్మల జ్యోతి-అనిల్, కోమటి శ్రీనివాస్, తాడూరి స్వామి, బాలగోని కృష్ణంరాజు, రావుల సురేందర్, ముప్పు సహదేవ్ తదితరుల ఇళ్లలో అధికారులంతా కుటుంబసభ్యులతో కలిసి స్వయంగా దీపాలు వెలిగించి, పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, గిర్దావర్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.













