బాహు బలంన్యూస్ జనగామ, అక్టోబర్ 11:కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం జనగామలో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు నర్సింహారెడ్డి అధ్యక్షతన ఓసీ ఐకాస, బహుజన కుల సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు, ప్రతినిధులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. తాము ఏ కులానికీ, మతానికీ, సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని కుండబద్దలు కొట్టారు. సమాజంలో అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు, సమన్యాయం కల్పించడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని, రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొన్ని కుటుంబాలకే పునరావృతం కాకుండా క్రీమీలేయర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసి అర్హులైన నిరుపేదలకు అవకాశాలు దక్కేలా చూడాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ (EWS) తరహాలోనే అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే పార్లమెంట్‌లో చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. ఈ యాత్ర అక్టోబర్ 24న ఆదిలాబాద్ ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించి, అక్టోబర్ 26న జనగామ, హనుమకొండ మీదుగా పరకాలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్ 26న మధ్యాహ్నం జనగామలో 5 వేల మందితో కార్నర్ మీటింగ్, అనంతరం సాయంత్రం 5 గంటలకు పరకాలలో పార్టీలకతీతంగా దాదాపు 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, ఉద్యమ రాష్ట్ర సమన్వయకర్తలు గోపు జైపాల్ రెడ్డి, అప్పమ్మగారి రాంరెడ్డి, తాడిశెట్టి పశుపతి, దుబ్బా శ్రీనివాస్, పైళ్ల హరినాథ్ రెడ్డి, కుమ్మరి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అవునూరి రామన్న, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, కార్పొరేటర్ లోకమంతారెడ్డి, నాయకులు జిల్లెల్ల జ్యోతిరెడ్డి, కొండ్ల రఘునందన్‌రెడ్డి, పడకంటి రవీందర్, బొమ్మకంటి అనిల్, మేకపోతుల నర్సింహగౌడ్, డాక్టర్ రాపాక శ్రీశైలం మాదిగ, పోరెడ్డి సత్యనారాయణరెడ్డి, చెరుకు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











