బాహు బలంన్యూస్ కరీంనగర్, అక్టోబర్ 10 :
కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లోని హోటల్ శ్రీనివాస్‌లో ఉమ్మడి జిల్లాల ఓసీ ఐకాస, రెడ్డి జేఏసీ, బహుజన కుల సంఘాల జేఏసీ నాయకులు, ప్రతినిధులతో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
అన్ని వర్గాల పేదల సంక్షేమమే ధ్యేయం
తాము ఏ కులానికీ, మతానికీ, సామాజిక వర్గానికీ వ్యతిరేకం కాదని నాయకులు స్పష్టం చేశారు. సమాజంలోని నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొద్దిమందికే పునరావృతమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అర్హులైన నిరుపేదలందరికీ న్యాయం జరిగేలా క్రీమీలేయర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ (EWS) తరహాలోనే అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు.
చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి
దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా సర్వే చేసి అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్‌లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ రథయాత్ర అక్టోబర్ 24న ఆదిలాబాద్ జిల్లా ద్వారా తెలంగాణలోకి ప్రవేశించి, అక్టోబర్ 26న జనగామ, హనుమకొండ మీదుగా సాయంత్రం 4 గంటలకు పరకాలకు చేరుకుంటుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 26న సాయంత్రం 5 గంటలకు పరకాలలో పార్టీలకు అతీతంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మహాసభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 10 వేల మందిని సమీకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సభకు సంబంధించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ జున్నుతుల రాజిరెడ్డి, బ్రాహ్మణ సంఘాల జిల్లా అధ్యక్షుడు కొత్తకొండ రవీందర్ రావు, ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘాల జేఏసీ అధ్యక్షుడు జంపాల నర్సయ్య, బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, ప్రముఖ నాయకులు పోల్సాని దేవేందర్ రావు, రావుల కిరణ్ రెడ్డి, అండెం రమణ రెడ్డి, దాసరి గోపి, వెన్నమనేని విక్రమ నరసింగరావు, తోపుచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










