బాహు బలంన్యూస్ హన్మకొండ,: కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నిరుపేదలకు ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని ఓసీ సమాఖ్య కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పేదలందరికీ సమాన న్యాయం దక్కాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధనకై సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్రీమీలేయర్ పకడ్బందీగా అమలు కాకపోవడం వల్ల అసలైన పేదలకు ఫలాలు అందడం లేదని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడం వల్ల ప్రతిభావంతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం చట్టబద్ధ కమిషన్ వేసి అధ్యయనం చేయాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె కోరారు.











