బాహు బలంన్యూస్,హన్మకొండ, : కుల, మత ప్రాతిపదికన కాకుండా అన్ని సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని ఓసీ సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, నిరుపేదలందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు, సమన్యాయం దక్కాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ప్రారంభమైన దేశవ్యాప్త బస్సుయాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఓసీ ఐకాస ప్రతినిధులు, మేధావులు ఈ యాత్రలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల ప్రయోజనాలన్నీ ఇప్పటికే లబ్ధిపొందిన కొద్ది కుటుంబాలకే పునరావృతమవుతున్నాయని, ఫలితంగా క్షేత్రస్థాయిలోని అర్హులైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతే ప్రతిభావంతులైన యువతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ (EWS) తరహాలోనే అన్ని సామాజిక వర్గాలలోని పేదలను ఆదుకునేలా నూతన విధానాన్ని రూపొందించాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టబద్ధ కమిషన్‌ను ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేయాలని, అవసరమైతే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం
పేదల సంక్షేమానికి చేసిన విశేష సేవలకుగాను ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర లలిత కళా సమాఖ్య నుంచి ‘సమాజ సేవా సామ్రాట్’ పురస్కారం అందుకున్న ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్‌ను రాష్ట్ర కమిటీ తరఫున నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి, నాయకులు నల్లా రాజిరెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, కోరళ్ల విద్యాసాగర్ రెడ్డి, భోంపెల్లి రంగారావు, కంది రవీందర్ రెడ్డి, గౌతం శర్మ తదితరులు పాల్గొన్నారు.











