బాహు బలంన్యూస్ న్యూఢిల్లీ:
సమాజంలోని అన్ని వర్గాల్లోని నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం జరగాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న కుల, మత ప్రాతిపదిక కాకుండా.. కేవలం ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు స్పష్టం చేశారు. పేదరికమే ప్రామాణికంగా రిజర్వేషన్ల విధానం ఉండాలన్నదే తమ జేఏసీ మూల సిద్ధాంతం, ప్రధాన ధ్యేయమని ఆయన తేల్చిచెప్పారు.
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రవీణ్ అరోరా చేపట్టిన దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రవీణ్ అరోరా ఈ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి హాజరైన పోలాడి రామారావు, అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
క్రీమీలేయర్ లేకపోవడంతో పేదలకు తీరని అన్యాయం:
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల వ్యవస్థలో సరైన క్రీమీలేయర్ నిబంధనలు లేకపోవడం వల్ల ఆయా వర్గాల్లోని నిజమైన అట్టడుగు, నిరుపేద ప్రజలకు ఫలాలు అందడం లేదని, వారు తీవ్రంగా నష్టపోతున్నారని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సామాజిక వర్గాల్లోని పేదవారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ కమిషన్ వేయాలి:
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజల వాస్తవ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను ఏర్పాటు చేసి, తగిన నివేదికను రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ అరోరా నేతృత్వంలో దేశవ్యాప్తంగా సాగే ఈ ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఓసీ జేఏసీ పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.











