బాహు బలంన్యూస్,హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని వర్గాల పేదలకు న్యాయం జరిగేలా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, దీనికి ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న దిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా నేతృత్వంలో ప్రారంభమయ్యే ‘దేశవ్యాప్త ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల బస్సు యాత్ర’కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ప్రారంభోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని తీర్మానించినట్లు తెలిపారు. అలాగే, ఈ బస్సు యాత్ర తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఓసీ సంఘాలు, జేఏసీలు రాజకీయాలకు అతీతంగా ఏళ్ల తరబడి చేసిన పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఓసీలలోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. తాము ఏ వర్గానికీ, మతానికీ వ్యతిరేకం కాదని.. పేదలందరికీ సమన్యాయం చేకూరాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదరికం తొలగిపోకపోవడానికి ప్రస్తుత విధానాలే కారణమని, ఇప్పటికైనా కుల మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు పార్లమెంటులో చర్చించి, చట్టబద్ధమైన ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ప్రస్తుత రిజర్వేషన్లలో సరైన ‘క్రీమీలేయర్’ విధానం అమలు కాకపోవడం వల్ల అట్టడుగు వర్గాల పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఓసీ ఐకాస జాతీయ ఛైర్మన్ నల్లా సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, ఆంధ్రప్రదేశ్ జేఏసీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు, ప్రతినిధులు చెన్నమనేని పురుషోత్తమరావు, చందుపట్ల నర్సింహారెడ్డి, కొత్తకొండ రవీందర్‌రావు, రత్నాకరశర్మ, బుస్సా శ్రీనివాస్, మహంకాళి రాజన్న, చకిలం రాజేశ్వరరావు, పోరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, బొమ్మదేవర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










