బాహు బలంన్యూస్ కరీంనగర్,ప్రతినిధి, సెప్టెంబర్ 29:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సీఎంకు ఓసీ జేఏసీ తరఫున బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీలో విలీనం చేసే జీవో 97ను రద్దు చేయాలని కోరారు. ఎకరానికి ఏటా రూ.15,000 రైతుభరోసా ఇవ్వాలని, మిగిలిన 30 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయడంతో పాటు అన్ని రకాల ధాన్యానికీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
రెడ్డి కార్పొరేషన్ సహా వివిధ ఓసీ సంక్షేమ కార్పొరేషన్లకు తక్షణమే పాలకమండళ్లను నియమించి తగిన నిధులు విడుదల చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్ పనులను పూర్తి చేయాలని, కేబుల్ బ్రిడ్జిపై అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి హెచ్చరించారు.
ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ ఓసీ జేఏసీ తరఫున బహిరంగ లేఖ రాయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.










