బాహు బలంన్యూస్ చొప్పదండి, అక్టోబర్ 16:
దేశంలో కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతి పేద కుటుంబానికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ సంధి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని రెడ్డి సంఘం భవనంలో జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల ఓసీ ఐకాస, రెడ్డి జేఏసీ, ఇతర ప్రజా సంఘాల నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా చేపట్టిన దేశవ్యాప్త బస్సు రథయాత్రకు సంబంధించిన గోడప్రతులను నాయకులు ఆవిష్కరించారు.
అందరికీ సమాన అవకాశాలే లక్ష్యం
ఈ సందర్భంగా పోలాడి రామారావు, సంధి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. తాము ఏ కులానికీ, మతానికీ లేదా వర్గానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పేదరికానికి కులం ఉండదని, అన్ని వర్గాల్లోని నిరుపేదలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ఉద్యమ పరమావధి అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ విధానాన్ని సమగ్రంగా సమీక్షించి, క్రీమీలేయర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్ల ఫలాలు కొన్ని కుటుంబాలకే పదే పదే దక్కకుండా, అర్హులైన నిరుపేద కుటుంబాలకు లభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్రం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ (EWS) విధానం తరహాలోనే అన్ని వర్గాల్లోని పేదలకు సముచిత న్యాయం జరిగేలా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి తక్షణమే చట్టబద్ధ కమిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.
24న తెలంగాణలోకి ప్రవేశించనున్న రథయాత్ర
ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్ఘాట్ నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త రథయాత్రకు ఓసీ, రెడ్డి ఐకాసలతో పాటు బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని నాయకులు తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 24న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించి నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా సాగుతుందన్నారు. అనంతరం 25న రామాయంపేట, తూప్రాన్ మీదుగా హైదరాబాద్ చేరుకుని, 26న జనగామ, హనుమకొండ మీదుగా పరకాలకు చేరుకుంటుందని వివరించారు. పరకాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు దాదాపు 50 వేల మందిని సమీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐకాస ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సంధి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డితో పాటు నాయకులు కొమర ఎల్లారెడ్డి, రూప్రెడ్డి స్కైలాబ్ రెడ్డి, కేతిరి మణిశంకరరెడ్డి, గన్ను నరసింహారెడ్డి, గుర్రం అంజిరెడ్డి, జంపాల నర్సయ్య, బచ్చు ఆనందం, తాళ్లపల్లి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.












