బహుబలం న్యూస్,హుజూరాబాద్, సెప్టెంబర్ 28:”నాడు కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలను కాదని.. నేడు అధికారం రాగానే గూడు మారిన వలసదారులకు అందలమెక్కిస్తే నిఖార్సైన కాంగ్రెస్ వాదుల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేరు” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శంకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆశీస్సులతో తాను బరిలో నిలుస్తున్నట్లు ఆయన కుండబద్దలు కొట్టారు.
నాలుగు దశాబ్దాల నిబద్ధత.. చెక్కుచెదరని విధేయత..
గత 40 ఏళ్లుగా ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా, పార్టీ అపజయాల్లో ఉన్నా పక్కచూపులు చూడకుండా కాంగ్రెస్ సిద్ధాంతాలకే అంకితమైన చరిత్ర తనదని శంకర్ స్పష్టం చేశారు. మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి పనిచేయడమే కాకుండా, మహాత్మా గాంధీ సూపర్ బజార్ డైరెక్టర్‌గా రెండు పర్యాయాలు, సింగిల్ విండో డైరెక్టర్‌గా, ప్రస్తుతం హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్‌గా ప్రజాసేవలో తలమునకలైనట్లు గుర్తుచేశారు. సుదీర్ఘకాలం పార్టీ బాగుకోసం చెమటోడ్చిన తన సేవలను గుర్తించి పార్టీ అధిష్ఠానం సింగిల్ విండో చైర్మన్ పగ్గాలను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
అధికార దాహంతో వచ్చిన వారికి అందలమా?
గత పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ శ్రేణులను అణచివేసి, సర్వస్వాన్నీ తామే అనుభవించిన నాయకులు.. అధికారం మారగానే రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుని కాంగ్రెస్‌లోకి దూరి పదవుల కోసం ఎగబడుతున్నారని శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనూ వారిదే ఆధిపత్యం.. నేడు ప్రజా ప్రభుత్వం వచ్చాక కూడా మళ్లీ వారికే పెత్తనం కట్టబెడితే క్షేత్రస్థాయిలో రక్తం ధారపోసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
“నాకు అవకాశం ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ పదేళ్లుగా లాఠీదెబ్బలు తిని, కేసులు భరించి పార్టీని కాపాడుకున్న నిజమైన కాంగ్రెస్ సైనికుడికే ఈ పదవి దక్కాలి. అవకాశవాద రాజకీయాలతో నిన్నమొన్న పార్టీలోకి చేరిన వలస నేతలకు పదవులు అప్పగిస్తే క్షేత్రస్థాయిలో తీవ్ర తిరుగుబాటు తప్పదు” అని ఆయన హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం, నియోజకవర్గ నాయకత్వం కార్యకర్తల మనోభావాలను గుర్తించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు











