బాహు బలంన్యూస్ హన్మకొండ ,:
“తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక, రాజీలేని పోరాటాలకు చిరునామా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన ఆశయాలను విస్మరిస్తే తెలంగాణ సమాజం క్షమించదు. పీడిత, శ్రామిక వర్గాల విముక్తి కోసం బాపూజీ రగిలించిన ఉద్యమ జ్వాలను మరింత రగిలించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి” అని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ హంటర్ రోడ్డులోని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్‌లో నెలకొల్పిన బాపూజీ విగ్రహానికి ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన ఘనంగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అనంతరం పోలాడి రామారావు ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ.. నిజాం రాచరికపు పాశవిక సంకెళ్లను తెంచిన సాయుధ పోరాటం మొదలుకొని, భారత స్వాతంత్ర్య సమరం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో బాపూజీ చూపిన తెగువ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని కొనియాడారు. “రాజకీయాల్లో పదవుల కోసం ఆరాటపడే నాయకులున్న నేటి కాలంలో.. 1969 తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చని పాలకుల ముఖాన మంత్రి పదవిని గడ్డిపోచలా విసిరికొట్టిన ధీరోదాత్తుడు బాపూజీ. ఆత్మగౌరవం ముందు అధికార దర్పం ఏపాటిదో నిరూపించిన నికార్సైన పోరాట యోధుడు” అని శ్లాఘించారు.
మలిదశ ఉద్యమం పల్లెల్లో రగులుతున్న తరుణంలో, నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యానికి అండగా నిలిచి, హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న తన సొంత నివాసం ‘జలదృశ్యం’ను ఉద్యమ కేంద్రంగా అప్పగించిన దాతృత్వం బాపూజీకే దక్కిందని గుర్తుచేశారు. సమాజంలో అసమానతల చీకట్లు తొలగిపోయి, చేతివృత్తులు, నేతన్నలు, శ్రామిక వర్గాల హక్కులు సంరక్షించబడి, అవినీతిరహిత పాలన సాగినప్పుడే బాపూజీ కలలుగన్న ప్రజాస్వామిక స్వప్నం సాకారమవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల నర్సింహారెడ్డి, కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం, ప్రధాన కార్యదర్శులు యేదాసు వెంకటేశ్వర్లు, డిబ్బి రమేష్, వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆకుల రవీందర్, ప్రధాన కార్యదర్శి గోరంటాల రాజు, కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. రాజ్ కుమార్ తదితర ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.













