బాహు బలంన్యూస్ హుజూరాబాద్, సెప్టెంబర్ 23:
హుజూరాబాద్ పట్టణంలో నేడు గణేశ్ నిమజ్జనోత్సవాలు జరుగుతున్న తరుణంలో కెనాల్‌లో నీరు లేకపోవడంపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో ప్రస్తుతం చుక్క నీరు లేకపోవడంతో విగ్రహాల నిమజ్జనానికి తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొందని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యపై జిల్లా మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఎస్సారెస్పీ కెనాల్‌లోకి యుద్ధప్రాతిపదికన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. నవరాత్రి ఉత్సవాలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారని, ఈరోజు జరిగే ముగింపు వేడుకైన నిమజ్జనానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం కెనాల్ పూర్తిగా ఎండిపోయి ఉండటంతో నిమజ్జనానికి తరలివచ్చే వేలాది మంది భక్తులు, మండపాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే స్పందించాలి
జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి కెనాల్‌లోకి నీటిని చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభావతి రెడ్డి కోరారు. నీటి విడుదలతో పాటు నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్ట భద్రత, లైటింగ్, పారిశుధ్య ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా సాగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.











