బాహు బలంన్యూస్ మానకొండూరు, మే 15:
రాష్ట్రంలోని రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 30వ తేదీన కరీంనగర్ వేదికగా ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన – సమరభేరి’ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడప్రతులను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల దోపిడీ
అనంతరం పోలాడి రామారావు, జడ్పీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని, దీంతో మిల్లర్లు, సిబ్బంది కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని సైతం కామన్ గ్రేడ్‌గా నమోదు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధాన్యం ఆరబోసే క్రమంలో ఎండల తీవ్రతకు రైతులు ప్రాణాలు కోల్పోతుండటం కలచివేస్తోందన్నారు.
బోనస్ అమలులో కొర్రీలు.. ‘భరోసా’లో వైఫల్యం
ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ చెల్లింపులో అనేక నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. పెట్టుబడి సాయం కింద అందించాల్సిన ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. యాసంగి సీజన్ ముగిసినా నేటికీ రైతుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో నిధులు జమ కాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వెంటనే అన్ని పంటలకు బోనస్ నిధులు విడుదల చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
రెండు లక్షల మందితో సమరభేరి
రాజకీయాలకు అతీతంగా రైతాంగ సమస్యలపై పోరాడటమే లక్ష్యంగా కరీంనగర్‌లో నిర్వహించే మహాగర్జన సభకు సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని పోలాడి రామారావు తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజాసంఘాల నాయకులు కదలిరావాలని పిలుపునిచ్చారు. తమ పోరాటానికి మద్దతుగా పెద్ద ఎత్తున తరలివస్తామని వివిధ పార్టీల నాయకులు ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ప్రజా సంఘాల నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, దేవ సతీష్ రెడ్డి, పంజాల శ్రీనివాస్, కసిరెడ్డి రాజేందర్ రెడ్డి, గోపు ఈశ్వర్ రెడ్డి, పిట్టల మధు, గంగుల రవి, బాకారపు రాములు, నెల్లి శంకర్ ముదిరాజ్, సర్పంచులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి సంపత్, పారునంది కిషన్, మోటం సమ్మయ్య, అనిల్ కుమార్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












