విద్యార్థులు మాతృభూమి సేవలో భాగం కావాలి: గోస్కుల అజయ్.

బాహు బలంన్యూస్ ప్రతినిధి (సబ్బని వెంకటస్వామి)
హుజురాబాద్,జులై 9:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో నేడు జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నగరంలో భారీ ర్యాలీ జరిగింది. నగరంలోని అన్ని కళాశాలలు, పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ మాట్లాడుతూ, 1949 జులై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కొద్ది మంది విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తూ, విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు.
అంతేకాకుండా, స్వాతంత్ర్యం రాకముందు ఎంతో మంది దేశం కోసం ప్రాణాలర్పించగా, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా 44 మంది ఏబీవీపీ కార్యకర్తలు జాతీయ జెండా కోసం తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి, జాతీయవాదం కోసం ఆర్‌ఎస్‌యూ రౌడీలకు వ్యతిరేకంగా పోరాడి భారతమాత పాదాల చెంత తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడని ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. ఇందిరా గాంధీ 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, దానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమించిందని పేర్కొన్నారు.
అస్సాం రాష్ట్రంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు వచ్చినప్పుడు “నేడు అస్సాంను రక్షించండి – రేపు భారతదేశాన్ని రక్షించండి” అనే నినాదంతో చొరబాటుదారులు రాకుండా ఉద్యమం చేసింది కేవలం ఏబీవీపీ మాత్రమేనని ఆయన వివరించారు. అలాగే, కేరళ రాష్ట్రంలో జాతీయవాదులపై దాడి జరిగినప్పుడు “చలో కేరళ” పేరుతో లక్ష మందికి పైగా ఏబీవీపీ కార్యకర్తలు కేరళ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ర్యాలీ తీసి, కేరళలో ఉన్న జాతీయవాదులకు తాము అండగా ఉన్నామని చాటి చెప్పారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంలో ఏబీవీపీ ఎన్నో ఏళ్లుగా చేసిన ఉద్యమం ఫలితంగానే రద్దయిందని, నేడు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. విద్య జాతీయకరణ కావాలని ఆనాడు గోడలపై రాసిన రాతలు నేడు చట్టమై పార్లమెంటులో ఆమోదం పొంది నూతన జాతీయ విద్యా విధానంగా అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏబీవీపీ ఎన్నో ఉద్యమాలు చేసిందని, “నా రక్తం నా తెలంగాణ” పేరుతో ఒకే రోజు ఇరవై వేల మంది విద్యార్థులతో రక్తదానం కార్యక్రమం నిర్వహించిందని, “తెలంగాణ రణభేరి” కార్యక్రమం కూడా నిర్వహించిందని అజయ్ వివరించారు. ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే, ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, బతికి ఉండి పచ్చని తెలంగాణను చూడాలని పిలుపునిచ్చి, “నా తెలంగాణకు హరితహారం” పేరుతో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.
ప్రతినిత్యం విద్యార్థుల మధ్య ఉంటూ ఎటువంటి సమస్య వచ్చినా ఏబీవీపీ పరిష్కరిస్తుందని, అలాంటి ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమికి సేవ చేయడం విద్యార్థులుగా మన అందరి కర్తవ్యమని, ఏబీవీపీ ఉద్యమాలలో అందరూ భాగస్వాములు కావాలని, ఈ దేశం కోసం పనిచేసే ఏబీవీపీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గోస్కుల అజయ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శులు వరికోలు రాజు, పెరుగు అభిలాష్, నగర ఉపాధ్యక్షులు ఎనగంటి కిరణ్, బొరుగాల గౌతమ్, బురగాల సిద్ధార్థ, నగర సామాజిక మాధ్యమ ప్రతినిధి దాట్ల అక్షయ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !