సబ్బనివెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హుజురాబాద్ జులై 28;
డాక్టరేట్… ఎంతో గౌరవప్రదమైన డిగ్రీ. విద్యార్థులు ఏళ్ళతరబడి చదివి డాక్టరేట్ పట్టా తీసుకుంటుంటే, వివిధ విభాగాల్లో ప్రముఖులు, పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తాయి పలు యూనివర్సి టీలు ,అయితే అలాంటి గౌరవ డాక్టరేట్ల విశిష్టమైన పట్టాకు విలువ లేకుండా చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. నకిలీ యూనివర్సిటీలను పెట్టి, డబ్బులు తీసుకొని గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నారు. అత్యంత గౌరవప్రదమైన డాక్టరేట్లను అంగట్లో కూరగాయలను అమ్మినట్టు అమ్ముతున్నారు.
50 వేలు ఇస్తే చాలు గౌరవ డాక్టరేట్..
యాబై వేల రూపాయలు ఇస్తే చాలు , ఎలాంటి అర్హత ఉండనవసరం లేదు. ఎలాంటి సేవలు చేయనవసరం లేదు. డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తారు నకిలీ యూనివర్సిటీల నిర్వాహకులు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని, ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసుకుని ఫేక్ డాక్టరేట్ల ను యదేచ్ఛగా విక్రయిస్తున్నాయి సదరు నకిలీ యూనివర్సిటీలు.
హుజురాబాద్ డాక్టర్ రేట్ల పై పోలీసులు విచారణ చేయాలి…
హుజురాబాద్ ఏరియాలో డాక్టరేట్లు పొందిన వారిపై పోలీసులు విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
హుజరాబాద్ నియోజకవర్గం లో 20 మంది వరకు గౌరవ డాక్టరేటు పొందినట్లు సమాచారం. వీరిలో ఎక్కువమంది ఏలాంటి రీసెర్చ్ చేయని సేవలు అందించని వారు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విదేశాల నుంచి సైతం డాక్టరేట్లు పొంది ఈ ప్రాంతంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నకిలీ డాక్టరేట్ల దందా కొనసాగిస్తున్న వారిని ఆశ్రయించి ఈ ప్రాంతంలోని కొందరు ప్రముఖ వ్యక్తులు డాక్టరేట్లను తెచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. నకిలీ యూనివర్సిటీ నిర్వాహకు లు ఏజెంట్ ద్వారా కుతూహలం ఉన్నవారికి గాలం వేసి ఫేక్ డాక్టరేట్లను విక్రయిస్తున్నట్లు పలువురు చర్చించుకుం టున్నారు.ఎందుకు కొరగాని వాళ్లకు సైతం గౌరవ డాక్టరేట్లు రావడం ఏమిటి అని విద్యావంతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరెవరు డాక్టరేట్లు పొందారు..? ఏ యూనివర్సిటీల నుంచి పొందారు..? అనే దానిపై లోతుగా పోలీసులు దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు. ఫేక్ డాక్టరేట్ల దందా బయటికి వస్తే వ్యక్తులతో పాటు ,నకిలీ యూనివర్సిటీల బాగోతం కూడా బయటపడే అవకాశం లేకపోలేదు.










