బాహు బలంన్యూస్ హుజూరాబాద్,ఆగస్టు 04: ఎస్సీ పంబాల కులస్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు పంబాల కుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు గొట్టె జమదగ్ని, కొరిమి నర్సింహస్వామి తెలిపారు. మంగళవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుని ఏడాదవుతున్నా అధికారులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ తదితర జిల్లాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, కేవలం కరీంనగర్ జిల్లాలోనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తమ కులానికి చెందిన విద్యార్థి చంద్రుడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడని, అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో మెయిన్స్ కోచింగ్ పొందేందుకు ఈ పత్రం అత్యవసరంగా కావాల్సి ఉందన్నారు. పత్రాలు లేక ఇతర విద్యార్థులు, ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గ్రామీణ దేవతల వద్ద పూజారులుగా వ్యవహరించే తమకు ప్రభుత్వం వెంటనే స్పందించి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని, లేకపోతే ఆందోళన బాటపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రౌతు అనిల్, కొరిమి అశోక్, పృథ్వీరాజ్, గుంటి శివ, విష్ణు, నర్సింహులు, గణేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.










