బాహు బలంన్యూస్, కరీంనగర్,సెప్టెంబర్ 15 :
ఆలోచనలకు రూపమిచ్చి, అభివృద్ధికి బాటలు వేస్తూ ఆధునిక దేశ నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (బీఈ) కొనియాడారు. భారత రత్న, ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఆయన ఇంజనీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ, దూరదృష్టితో అద్భుతమైన ప్రాజెక్టులను దేశానికి అందించి, సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచపటంలో నిలిపిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. ఆయన అంకితభావం, క్రమశిక్షణ నేటి తరం ఇంజనీర్లకు నిత్య స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ మౌలిక సదుపాయాల కల్పనలో, సమాజ ప్రగతిలో అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఇంజనీర్‌ను ఈ సందర్భంగా అభినందించారు.
తోటి గ్రాడ్యుయేట్లకు శుభాకాంక్షలు:
ముఖ్యంగా 1982–86 బ్యాచ్‌కు చెందిన తన తోటి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ ప్రత్యేకంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నత సేవలందిస్తున్న ఇంజనీరింగ్ సహచరుల కృషి ప్రశంసనీయమన్నారు.
సెప్టెంబర్ 18న ఆత్మీయ సమ్మేళనం:
ఉమ్మడి వరంగల్-హనుమకొండ వేదికగా సెప్టెంబర్ 18న 1982–86 బ్యాచ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘ఆత్మీయ సమ్మేళనం’ (ఈవెంట్ సమ్మిట్) నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగు దశాబ్దాల జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు, స్నేహ బంధాలను పునరుద్ధరించుకునేందుకు ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఇంజనీరింగ్ మిత్రులందరూ తప్పక రిజిస్ట్రేషన్ చేసుకొని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పోలాడి రామారావు హృదయపూర్వకంగా ఆహ్వానించారు.










