హుజురాబాద్, బాహు బలంన్యూస్ ఆగస్టు 02 : బాధిత ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని హుజురాబాద్ పట్టణంలోని కొన్ని ఆప్టికల్ షాపుల యజమానులు నిలువుదోపిడీకి తెరలేపారు. మానవత్వాన్ని మంటగలిపి, నిబంధనలను తుంగలో తొక్కుతూ కాసుల కక్కుర్తి కోసం ప్రజల కంటి వెలుగుతో చెలగాటమాడుతున్నారు. కేవలం రూ. 50 లభించే నాసిరకం అద్దాలను ఏకంగా రూ. 3,000 వరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
అర్హతల్లేని సిబ్బంది.. అవసరం లేకున్నా అద్దాలు!
నిబంధనల ప్రకారం కంటి పరీక్షలు నిర్వహించడానికి ‘డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ’ లేదా తత్సమాన అర్హత కలిగిన నిపుణులు ఉండాలి. కానీ, పట్టణంలోని పలు షాపుల్లో ఎలాంటి కనీస అర్హత, అనుభవం లేని వారే వైద్యుల అవతారమెత్తారు. షాపులకు వచ్చే వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ.. చూపు బాగున్నా ఏదో ఒక లోపం ఉందంటూ బలవంతంగా అద్దాలను అంటగడుతున్నారు. దీని వెనుక కొన్ని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆప్టికల్ షాపుల నిర్వాహకుల మధ్య పెద్ద ఎత్తున కమిషన్ల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లైసెన్స్ లేకుండానే మందుల పంపిణీ!
మందుల విక్రయానికి డ్రగ్ లైసెన్స్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉండాలనే కనీస నియమాన్ని సైతం వీరు బేఖాతరు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నాసిరకం కంటి చుక్కల మందులు (ఐ డ్రాప్స్) విక్రయిస్తూ రోగుల చూపు శాశ్వతంగా దెబ్బతినేలా ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు.
తప్పుడు అద్దాలతో వృద్ధుడికి ప్రమాదం
ఇటీవల పట్టణానికి చెందిన ఓ వృద్ధ దంపతులు దూరపు చూపు సమస్యతో ఇక్కడి ప్రముఖ ఆప్టికల్ షాపును ఆశ్రయించారు. సదరు షాపులో తప్పుడు పరీక్షల అనంతరం వారికి కంటి అద్దాలు ఇచ్చారు. ఆ అద్దాలు ధరించి షాపు బయటకు వచ్చి మెట్లు దిగుతుండగా లోపం ఉన్న అద్దాల వల్ల దూరం స్పష్టంగా తెలియక వృద్ధుడు కిందపడిపోయాడు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ఆందోళనకు గురైన వృద్ధ దంపతులు నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పట్టణంలో బహిరంగంగానే ఇంతటి అక్రమాలు జరుగుతున్నా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అర్హత లేని షాపులను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.










