బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 11:
విద్యార్థులు చదువుతో పాటు సమాజహితమైన నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘వాగ్దేవి ఫియెస్టా – ఫ్రెషర్స్ డే’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ.. యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సీఐ టి. కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, సత్ప్రవర్తనలే భవిష్యత్తు విజయానికి పునాదులని స్పష్టం చేశారు. కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి తమ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని, చదువుతో పాటు వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. కళాశాల కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి కొత్త విద్యార్థులకు సూచించారు. అనంతరం కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. వేణుమాధవ్ మాట్లాడుతూ నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా విద్యా, క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












