బాహు బలంన్యూస్ హుజూరాబాద్: ఆగస్టు 02 :
రాష్ట్రంలో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ పిలుపుమేరకు హుజూరాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని ఆధ్వర్యంలో నాయకులు ఆదివారం హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల తహసిల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ హుజూరాబాద్ అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ… రిటైర్మెంట్ల వల్ల ఏర్పడిన గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులతో పాటు కొత్త జిల్లాలు, మండలాల్లోని ఉద్యోగాలను ఏళ్లుగా భర్తీ చేయకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీల వల్ల నిరుపేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలీసు శాఖలోని ఖాళీల వల్ల శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని శాఖల్లోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్, కోశాధికారి ఇప్పకాయల సాగర్, నాయకులు కొలిపాక క్రాంతి, మామునూరి ప్రవీణ్, గడ్డం రఘు తదితరులు పాల్గొన్నారు.











