బాహు బలంన్యూస్,హుజూరాబాద్, సెప్టెంబర్ 11:స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989 బ్యాచ్‌లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈనెల 13న (ఆదివారం) జరగనుంది. హనుమకొండ రహదారిలోని మధువని గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు గోలి సురేష్, శనిగరపు నరేందర్, అనుముల ప్రవీణ్ శర్మ, అక్కినపల్లి అనిల్ కుమార్, పొన్నోజు సంతోష్ కుమార్ తెలిపారు.
శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు 37 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం సహచర మిత్రులంతా ఒకేచోట కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. నాటి గురువులు అందించిన విద్యాబుద్ధులు, ప్రోత్సాహంతోనే నేడు తమ బ్యాచ్ మిత్రులు ఉపాధ్యాయ, సాఫ్ట్‌వేర్, వ్యాపార రంగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని, పలువురు అమెరికా తదితర విదేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.
ఈ ఆత్మీయ కలయికకు నాటి ప్రధానోపాధ్యాయులు ఆలేటి మదన్‌మోహన్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు గూడూరు మల్లారెడ్డి, రాధాకిషన్, రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులంతా అధిక సంఖ్యలో పాల్గొని నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పూర్వ విద్యార్థుల ఐక్యతతో పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని వారు స్పష్టం చేశారు.











