బాహు బలంన్యూస్,హనుమకొండ, జూలై 31:
ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించిన ఆయన నిష్క్రమణ తెలంగాణ సమాజానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గానికి పూడ్చలేని లోటని పేర్కొన్నారు.
శుక్రవారం హనుమకొండలోని సమాఖ్య కార్యాలయంలో గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావుల నేతృత్వంలో కీ.శే. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అర్ధరాత్రి కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు
ఈ సందర్భంగా గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావు మాట్లాడుతూ.. ఈ నెల 26న తీవ్ర ఛాతీ నొప్పితో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరిన సుదర్శన్ రెడ్డి, చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారని తెలిపారు. నిత్యం సౌమ్యుడిగా, ప్రజా నాయకుడిగా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు ఇలా హఠాత్తుగా దూరమవ్వడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జైపాల్ రెడ్డి, రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ మార్గం నుంచి బహుముఖ సేవలు
విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లబెల్లి జడ్పీటీసీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షుడిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీలక పాత్ర పోషించారని గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావు కొనియాడారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన ప్రతి బాధ్యతనూ అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఆయన, హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికల సమయంలో వీణవంక మండల ఇన్‌చార్జిగా వ్యవహరించి వ్యూహాత్మకంగా శ్రమించారని గుర్తు చేశారు.
ఓసీ పేదల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ..
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా నాణ్యమైన సేవలందించడమే కాకుండా, ఓసీల్లోని నిరుపేదల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని జైపాల్ రెడ్డి, రామారావు తెలిపారు. రైతాంగ అభ్యున్నతికి, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన విశేష కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఓసీ జేఏసీ తరఫున గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ నివాళి కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, రావుల నర్సింహారెడ్డి, కామిడి సతీష్ రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, నల్లా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.











