బాహు బలంన్యూస్,హుజూరాబాద్, ఆగస్టు 01 :
ఏజెన్సీలు, దళారీ వ్యవస్థ లేకుండా ఉచితంగా లేదా ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు రుసుముతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు దళారుల పాలిట అక్రమార్జనగా మారుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల అండదండలు, లోపాయికారీ ఒప్పందాలను అడ్డుపెట్టుకుని ఓ దళారీ నకిలీ సర్టిఫికేట్లు సృష్టిస్తూ, ఏకంగా మీసేవ కేంద్రంతోనే ప్రైవేటు ఒప్పందం కుదుర్చుకుని బహిరంగంగా దోపిడీకి తెరతీసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హుజురాబాద్ మండలం లోనీ సిర్సపల్లి గ్రామానికి చెందిన ఓ దళారీ, ప్రభుత్వ యంత్రాంగంలోని పలు శాఖల అధికారులతో ఉన్న అక్రమ పరిచయాలతో అమాయక ప్రజల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్నాడు. దరఖాస్తుదారులకు అవసరమైన అసలు ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, స్వయంగా నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నాడు. దరఖాస్తులలో వయస్సు (ఏజ్) తక్కువ ఉన్నా, ఇతర లోపాలున్నా డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడు. ఎప్పుడో జరిగిన వివాహాలను కూడా ఇప్పుడే జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, కళ్యాణలక్ష్మి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కార్మిక శాఖ పథకాలపై ‘రేటు ఛార్ట్’!
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలాన్ని ఆసరాగా చేసుకుని ఈ దళారీ బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. సాధారణంగా ప్రభుత్వం ₹110 నామమాత్రపు రుసుముతో 5 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగిన లేబర్ కార్డును అందిస్తుంటే, ఈ దళారీ దరఖాస్తుదారుల నుంచి ఏకంగా ₹1,000 నుండి ₹2,000 వరకు వసూలు చేస్తున్నాడు.
అలాగే కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ₹30,000 వివాహ కానుకగా ఇస్తుంటే, అందులో ఈ దళారీ తన కమీషన్‌గా ₹5,000 గుంజుతున్నాడు. ప్రసవ సమయంలో ఇచ్చే ₹30,000 ప్రసవ కానుక (బర్త్ క్లైమ్) సహాయంలోనూ భారీగా నొక్కేస్తున్నాడు. ఇక ప్రమాదవశాత్తు లేదా అకాల మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అందే డెత్ క్లైమ్‌ల విషయంలో ఈ దళారీ ఏకంగా ₹30,000 నుండి ₹50,000 వరకు మామూళ్ల రూపంలో పిండుకుంటుండటం గమనార్హం.
మీసేవకే నెలకు ₹13,000 ముడుపులు!
ఈ అక్రమ దందాను యథేచ్ఛగా నడిపేందుకు ఆ దళారి వ్యక్తి జులై 11, 2026 నుంచి హుజురాబాద్ లోని ఓ మీసేవ’ కేంద్రంతో ఆరు నెలల కాలపరిమితికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. నకిలీ పత్రాలు, దరఖాస్తులను మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్ చేయిస్తూ, అధికారుల సహాయంతో పనులు ముగించి, ఆ దోపిడీ సొమ్ము నుంచి మీసేవ కేంద్రానికే ప్రతినెల ₹13,000 చెల్లించేలా అంగీకారం కుదుర్చుకున్నాడు. మరొక వ్యక్తి ముందు సాక్షిగా ఈ ఒప్పందం జరిగింది.
ఒక్క మీసేవకే నెలకు ₹13,000 కప్పం కడుతున్నాడంటే, కార్మిక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ఉన్న అక్రమ ఒప్పందాలతో ఈ దళారీ ఇంకెంత మొత్తంలో పేదల పొట్ట కొడుతున్నాడో అర్ధమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు స్పందించి ఈ దళారీ దందాపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కార్మికులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు










