బాహు బలంన్యూస్ వహుజూరాబాద్, జూలై 27:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ వారి ఆరోగ్యానికి బాటలు వేస్తున్న జయన్న ఫౌండేషన్ సేవలు ఎంతో అభినందనీయమని హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కొనియాడారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 11 తాగునీటి కేంద్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల పాఠశాలలతో పాటు కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, సిరసపల్లి, సింగపూర్, చెల్పూర్ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన వాటర్ ప్యూరిఫైయర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. వీటితో పాటు రాజపల్లి గ్రామంలో ప్రజల వినియోగం కోసం నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూడా ఆయన అందుబాటులోకి తెచ్చారు.
పిల్లల భవిష్యత్తే సమాజానికి పునాది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని ఉద్ఘాటించారు. “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు స్వచ్ఛమైన నీరు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నేను ఎల్లప్పుడూ ముందుంటాను” అని చెప్పారు.
చెల్పూర్ ప్రభుత్వ పాఠశాల దత్తత!
చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ఈ వేదికగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. పాఠశాలను దశలవారీగా అన్ని రకాల వసతులతో మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదనపు తరగతి గదులు, మెరుగైన పారిశుధ్యం, తాగునీటి వసతులను త్వరలోనే సమకూరుస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఆదర్శ విద్యాసంస్థలుగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
మా లక్ష్యం విద్యార్థుల ప్రోత్సాహమే: జయన్న ఫౌండేషన్
అనంతరం జయన్న ఫౌండేషన్ ఛైర్మన్ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, వారిని విద్యారంగంలో మరింత ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక సేవే ధ్యేయంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు 1,285 మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశామని వివరించారు. ప్రజల సౌకర్యార్థం త్వరలోనే శవాలను భద్రపరిచే ఫ్రీజర్లను కొనుగోలు చేసి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్న ఛైర్మన్ సరిత జైపాల్ రెడ్డిలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా పొన్నాడతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక నాయకులు గందె శ్రీనివాస్, తిరుమల్, ముత్యం రాజు, రాజు, సర్పంచ్ మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















