బాహు బలంన్యూస్,హన్మకొండ, జూలై 26 :
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాగించిన అకుంటిత పోరాట విజయమని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వ్యాఖ్యానించారు. నిర్బంధాలు, అణచివేతలతో విద్యార్థుల గొంతును నొక్కలేరని ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందన్నారు. ఆదివారం హన్మకొండలో నిర్వహించిన ప్రజా సంఘాల నాయకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు..
నీట్ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీసిందని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలు, వారి తల్లిదండ్రుల కలలు ఈ అక్రమాల వల్ల ఒక్కసారిగా కల్లలయ్యాయని పేర్కొన్నారు. పేపర్ లీకేజీల కారణంగా మానసిక వేదనకు గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమన్నారు. భవిష్యత్తుపై అభద్రతా భావంతో యువత తీవ్ర ఆందోళనలో కూరుకుపోయిందని తెలిపారు.
విద్యార్థులపై నిర్బంధాలు ఖండానర్హం
నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షా విధానం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగించి కర్కశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పాలకుల అలసత్వం, ఉదాసీన వైఖరి వల్లే విద్యార్థుల ఉద్యమం తారస్థాయికి చేరిందని స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆందోళన బాట పట్టిన యువతపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. అలాగే, నిరసనకారులపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
ఈ పరీక్షల అక్రమాలు, లీకేజీల వల్ల మానసిక ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దేశంలో ఎలాంటి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాలు జరిగినా లోటుపాట్లకు తావులేకుండా వకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిరుద్యోగ సమస్యపై సత్వర చర్యలు అవసరం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడంలో పాలకులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగ యువత వయోపరిమితి దాటిపోయి తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయకపోతే రాబోయే రోజుల్లో యువత ఆగ్రహానికి గురై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు కన్నం లక్ష్మణ్, బోయినపల్లి సత్యనారాయణ రావు, సూరం వెంకట్ రెడ్డి, జంపాల నర్సయ్య, గూడూరి చందర్, తాటిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











