బాహు బలంన్యూస్ కరీంనగర్ జూలై 25 :
దేశవ్యాప్తంగా కోట్లమంది విద్యార్థులు, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ‘నీట్’ (NEET) ప్రవేశ పరీక్షల అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నెల రోజులుగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఆందోళనల తీవ్రతను గుర్తించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో శనివారం ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజీనామాతో ముగియదు.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పువు!
ప్రభుత్వాలు నిర్బంధాలతో లేదా పోలీసు బలగాలను ఉపయోగించి యువత గొంతు నొక్కలేరని ఈ పోరాటం ద్వారా మరోసారి రుజువైందని పోలాడి రామారావు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల కోసం శాంతియుత పోరాటం చేస్తున్న విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, పరీక్షల రద్దు గందరగోళం తాళలేక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని డిమాండ్ చేశారు.
జాప్యం చేసి ఉంటే పరిస్థితి దారితప్పేది!
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై పాలకులు చూపిన ఉదాసీనత, అలసత్వమే ఉద్యమం తారాస్థాయికి చేరడానికి కారణమన్నారు. “ప్రభుత్వం స్పందించడంలో ఇంకా ఆలస్యం చేసి ఉంటే, ఈ పోరాటంలోకి అరాచక శక్తులు ప్రవేశించి పరిస్థితి చేయి దాటే ప్రమాదం పొంచి ఉండేదని మేధావి వర్గాలు మదనపడ్డాయి. ఇది కేవలం ఒక్క పరీక్షకు సంబంధించిన సమస్య కాదు.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం” అని రామారావు స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు రావాలి..
ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరచి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామకాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా, పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల నిరుద్యోగ యువత వయోపరిమితి దాటి తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాసంఘాల నాయకులు కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, విక్రమనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.










