బాహు బలంన్యూస్,కరీంనగర్, జూలై 24: కష్టపడి చదివి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, రాజకీయ పక్షాలు చెలగాటమాడటం తగదని, నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా పోరాడుతున్న విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల సమస్యపై పాలక, ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నో ఏళ్లుగా రేయింబవళ్లు శ్రమించి చదివిన విద్యార్థుల ఆశలు, వారి తల్లిదండ్రుల సుదీర్ఘ కలలు ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన తీవ్రమైన తప్పుల కారణంగా మనస్తాపానికి గురై దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమని, లక్షలాది మంది విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తుపై అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో విద్యార్థుల దేశవ్యాప్త నిరసనకు సంఘీభావంగా నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల సమాఖ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై పెద్ద మచ్చ..
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక్క ప్రవేశ పరీక్షలో జరిగిన తప్పిదం కాదని, మొత్తం దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపైనే పడిన ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్ష విధానం కోసం ‘ఛలో పార్లమెంట్’ పిలుపునిచ్చి ఢిల్లీలో గళమెత్తిన విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలపై కేంద్ర ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించిందని మండిపడ్డారు. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు గోళాలు ప్రయోగించి అణిచివేత, దమనకాండకు పాల్పడడాన్ని ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్బంధాలతో విద్యార్థుల గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన ఆందోళనలపై పాలకుల అలసత్వం, ఉదాసీనత వల్లే దేశ రాజధానిలో ఈ ఉద్యమం తారస్థాయికి చేరిందని విమర్శించారు.
బాధితులకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలి..
ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసి పాలకులు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. నీట్ అక్రమాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలన్నారు. విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, స్కాలర్‌షిప్‌ల పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించాలని, ప్రవేశ పరీక్షలు మరియు ఉద్యోగ నియామకాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా వకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో పాలకులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, ఫలితంగా నిరుద్యోగ యువత వయోపరిమితి దాటి ఉద్యోగాలకు నోచుకోక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే యువత ఆగ్రహానికి గురై మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదే అదనుగా విద్యార్థుల ఆందోళనలను దారిమళ్లించే ప్రేరేపిత సాంఘిక వ్యతిరేక శక్తుల (Anti-social elements) పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఈ సంఘీభావ కార్యక్రమంలో వివిధ ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కన్నం లక్ష్మణ్, కూరతోట సురేందర్, కల్వకుంట్ల వంశీధర్ రావు, బండ సుధాకర్ రెడ్డి, జనగామ కరుణాకర్ రావు, పిన్నింటి లక్ష్మణ్ కుమార్, జంపాల బాబు, పోల్సాని సునీల్, కనపర్తి సాయి, మిరుదొడ్డి అనిల్, భరత్, మంద మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










