దండకారణ్యం నెత్తుటి మరకలతో, కన్నీటి గాథలతో నిండి ఉంది: టీచర్ సోనీ సోరీ ఆవేదన

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:”దండకారణ్యం ఇప్పుడు నెత్తురు, కన్నీళ్లు, క్రూరమైన హింసతో నిండిపోయింది. ఇది ఒక అడవి బిడ్డ ఆక్రందన” అంటూ ఆదివాసీ హక్కుల నేత, టీచర్ సోనీ సోరీ తన హృదయ విదారక గాథను వినిపించారు. ప్రొఫెసర్ కె.పి. సుబ్బారావు సంస్మరణ సభలో ఆమె చేసిన ప్రసంగం బస్తర్ ప్రాంతంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పట్టింది.
బస్తర్ ప్రజల తరఫున అందరికీ సలాం తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సోనీ సోరీ, మానవత్వం ఉన్న సమాజం కోసం కృషి చేసిన సుబ్బారావు ప్రస్తుతం లేకపోయినా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని అన్నారు.
బస్తర్‌లోని పరిస్థితులు అందరికీ తెలుసని చెబుతూ, శాంతి చర్చలు జరగాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. గతంలో సల్వాజుడుమ్ సమయంలో ఆదివాసీ ప్రజలను దారుణంగా చంపారని, మహిళలపై అత్యాచారాలు చేశారని, ఇళ్లను తగులబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బస్తర్‌లో సహజ సంపద ఉండటం వల్లే ప్రభుత్వం అక్కడి ఆదివాసులను మానవహననం చేస్తోందని ఆమె ఆరోపించారు.
“2026 మార్చి 31 వరకు నక్సల్స్‌ను ఖతం చేస్తామని అంటున్నారు. నక్సల్స్‌ను అంతం చేస్తామనే పేరుతో ఎవరిని అంతం చేస్తున్నారు? అమిత్ షాకు తెలుసు… నక్సలైట్లను కాదు వారి పేరుతో ఆదివాసులను అంతం చేస్తున్నారని” అని సోనీ సోరీ అన్నారు. ఒక మావోయిస్టును చంపడానికి పది మంది ఆదివాసులను చంపుతున్నారని, నిరాయుధులను కాల్చి చంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద రోడ్ల నిర్మాణం కోసం పెద్ద వృక్షాలను నరికివేస్తుంటే, చంకలో బిడ్డతో ఉన్న ఒక తల్లి అడ్డుకోబోతే ఆమెపై కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఆరు నెలల పసికందు మరణించిందని ఆమె కన్నీటితో చెప్పారు. ఐఈడీ పేలుళ్ల వల్ల ఎంతో మంది చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట నృత్యాలు చేసే ఆదివాసీలు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం లేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆమె తెలిపారు.
నక్సలైట్ల పేరుతో ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయని, ఇళ్లలో ఉన్నవారిని ఎత్తుకెళ్లి చంపుతున్నారని ఆమె ఆరోపించారు. తెల్లవారుజామున తెందు ఆకులు కోయడానికి వెళ్లిన వారిని చుట్టుముట్టి కాల్చి చంపారని, ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లు ఎక్కిన వారిని కూడా కాల్చి చంపారని ఆమె భయానక పరిస్థితులను వివరించారు.
ఇటీవల 2025లో 40 మందికి పైగా ఆదివాసీలను అరెస్టు చేశారని, ఆరుగురిని కాల్చి చంపేశారని ఆమె తెలిపారు. తమ అక్కచెల్లెళ్లను, తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, పురుషుల పురుషాంగాలను కోస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో వేటకు వెళ్లే ఆదివాసీలను మావోయిస్టులుగా చిత్రీకరించి చంపుతున్నారని, మహిళలపై దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మహిళల స్థనాలను కోసి, తొడలపై పొడిచి, కళ్లు పీకి, మర్మాంగాలను ఛిద్రం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాము భారత దేశ పౌరులం కాదా అని ప్రశ్నించిన సోనీ సోరీ, ఇప్పుడు శాంతి చర్చలు జరగాలని ప్రభుత్వం, మావోయిస్టులు కూడా అంటున్నప్పటికీ, ప్రభుత్వం నిజాయితీగా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టులు పెట్టిన షరతులను ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే కాల్పులు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు.
కేవలం బస్తర్‌లో ఎత్తే స్వరం సరిపోదని, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల నుంచి కూడా శాంతి చర్చల కోసం గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అడవిని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఇవ్వడానికి నక్సలైట్ల పేరుతో ఆదివాసులను హత్య చేయడం, జైళ్లకు పంపడం, అత్యాచారాలు చేయడం పథకం ప్రకారమే జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
బైలదిల్లా కొండల్లో ఇనుప ఖనిజం కోసం అదాని, జిందాల్ ప్రయత్నించారని, అయితే ఆదివాసీల పోరాటం వల్ల అది సాధ్యం కాలేదని ఆమె తెలిపారు. బీజేపీ వచ్చాక మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని, గ్రామ ప్రజలను లోబరుచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలను బెదిరించి లొంగిపోయేలా చేస్తున్నారని, అలా లొంగిపోయిన వారిని తిరిగి అరెస్టు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులే హత్యలు చేస్తున్నారని, డబ్బులు తీసుకుంటున్నారని, లొంగిపోయేలా చేసేది వారేనని, అత్యాచారాలు చేసేది వారేనని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ జరిపించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదని, సీపీఐ, మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నా ప్రభుత్వం వినడం లేదని ఆమె విమర్శించారు. ఐఈడీ పేలుళ్లలో ఎంతో మంది చనిపోతున్నారని, 2024లో పేలని ఐఈడీని పిల్లలు ఆట వస్తువు అనుకొని తాకితే పేలి మరణించారని ఆమె కన్నీటితో చెప్పారు.
ఆదివాసీలు అంటే వారికి క్రిమికీటకాల్లాంటి వారని, వారిని ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారని సోనీ సోరీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శరీరాన్ని రెండు, మూడు లక్షలకు ప్రకటిస్తున్నారని, దీని గురించి ప్రశ్నిస్తే మావోయిస్టులను సమర్థిస్తున్నారని అంటారని ఆమె తెలిపారు. చెట్ల మీద తూటాలు పేలుస్తూ అడవిని నాశనం చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి తమ శక్తి, దేవత అని, ఆదివాసీలు తమ భద్రత కంటే ఎక్కువగా వాటి కోసం ఏడుస్తారని ఆమె అన్నారు.
2025లో నలుగురు పిల్లలకు తూటాలు తగిలాయని, వారికి బహుమానాలు ప్రకటించారని, 12, 13 సంవత్సరాల అమ్మాయికి వెనుక మెడ మీద తూటా తగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బస్తర్‌లో పిల్లలు, వృద్ధులు క్షేమంగా లేరని, బస్తర్ కోసం అందరూ గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
బస్తర్‌లోకి ఎవరినీ రానివ్వడం లేదని, డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయని, ప్రతిరోజూ ఏదో ఒక ఘోరం జరుగుతోందని ఆమె తెలిపారు. చింతల్నార్‌లో ఒక అమ్మాయి ఇంట్లో పడుకుని ఉంటే తీసుకెళ్లి అత్యాచారం చేశారని, రేణుకను పగలు పట్టుకున్నారని ఆమె భయానక పరిస్థితులను వివరించారు. రెండువైపులా సాయుధుల మధ్య చర్చలు జరగాలని, మావోయిస్టుల షరతులు ఒప్పుకున్నా లేకున్నా ఆదివాసీల డిమాండ్లను నెరవేర్చాలని ఆమె కోరారు.
పెసా చట్టాన్ని, 5వ షెడ్యూల్‌ను అమలు చేయాలని, తమ హక్కులు తమకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడం లేదని ఆమె విమర్శించారు. తాను ఒక టీచర్‌నని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంటుందని, కానీ తనను మావోయిస్టు అని జైలులో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లేముందు చిత్రహింసలు పెట్టారని, కరెంట్ షాక్‌లు ఇచ్చారని, పురుషుల మధ్య వివస్త్రను చేసి యోనిలో రాళ్లు దూర్చారని ఆమె భయానక అనుభవాన్ని పంచుకున్నారు. తన భర్తను కూడా విపరీతంగా కొట్టారని, జైలులో పెట్టారని, ఆయన ఆరోగ్యం పాడైపోయి చనిపోయారని ఆమె కన్నీటితో చెప్పారు.
గృహ మంత్రి బస్తర్‌లో మావోయిస్టులను అంతం చేస్తానంటున్నారని, కానీ వారి వెనుక ఆదివాసులు ఉన్నారని ఆమె గుర్తు చేశారు. బస్తర్‌ను ఎలా కాపాడాలనేదే తన వేదన అని, అక్కడి జల్, జంగల్, జమీన్‌ను కాపాడాలని ఆమె కోరారు. బస్తర్ రక్తంతో తడిసిపోయిందని, భారతదేశంలో అందరూ గళం విప్పాలని, బస్తర్‌ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఆదివాసీ అని, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి ఆదివాసీ అని, అయినా తమను నిర్దయగా చంపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చెట్లు ఎక్కి పడుకుంటున్నారని, ఒక ఊరికి వెళ్లినప్పుడు కాల్పులు జరుగుతుంటే సొరంగాల్లో దాక్కున్నారని, నీళ్లు, తిండి లేక అలా ఉండిపోయారని ఆమె భయానక పరిస్థితులను వివరించారు.
ఖనిజ సంపదను పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదంతా చేస్తోందని, హత్యలు చేసి అభివృద్ధి సాధించలేమని ఆమె అన్నారు. తమ పెసా చట్టాన్ని అమలు చేయాలని, ఆ సంపద తమదని, తమ అనుమతి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది తమ హక్కు అని, దాని కోసం పోరాడుతామని, కడుపులో ఉన్న బిడ్డ కూడా తుపాకీకి ఎదురు నిలుస్తుందని, తాము ఓడిపోమని, అంతం వరకు పోరాడుతామని సోనీ సోరీ తన ప్రసంగాన్ని ముగించారు.
మూలం : ఆదివాసీ హక్కుల నేత సోని సోరి హిందీ ప్రసంగం
అనువాదం : పద్మ కొండిపర్తి, న్యాయవాది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !