బాహు బలంన్యూస్ హుస్నాబాద్, మే 03: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం తక్షణమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన, వర్షానికి తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు కొనుగోళ్లలో రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కొనుగోళ్లలో జాప్యం.. దళారుల దోపిడీ
ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి పది రోజులు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో తూకాలు జరగడం లేదని పోలాడి రామారావు మండిపడ్డారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు రాత్రింబగళ్లు కళ్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, నేడు కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల ఆక్రందనలు మిన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందమేనని ఆయన ఆరోపించారు.
క్వింటాల్‌కు 5 కిలోల తరుగు దారుణం
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రామారావు ధ్వజమెత్తారు. “ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా, సాధారణ రకం ధర ఇస్తేనే తీసుకుంటామని మిల్లర్లు బెదిరిస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 20 కట్ చేయడంతో పాటు, తూకం సమయంలో ఐదు కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటూ రైతుల శ్రమను నిలువునా దోచుకుంటున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న రకాలకు ఇస్తామన్న రూ. 500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు.
మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’
రైతు భరోసా నిధులను విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమని, సన్న వడ్లకు బోనస్‌ను ధాన్యం డబ్బులతో పాటే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరితో పాటు పొద్దు తిరుగుడు, శనగ, మొక్కజొన్న రైతులను కూడా ఆదుకోవాలన్నారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మే 30వ తేదీన కరీంనగర్‌లో రెండు లక్షల మందితో ‘రైతు మహాగర్జన’ సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చందుపట్ల జనార్దన్, ఇరుపెండ్ల లింగారెడ్డి, కొత్తకొండ ఆంజనేయులు, మారుపాక రాజు, తిప్పర్ల తిరుపతి, గౌరవేణి రాజు తదితరులు పాల్గొన్నారు.











