బాహు బలంన్యూస్ కరీంనగర్, మే 01: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునే విషయంలో ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం రైతు ప్రజాసంఘాల ఐకాస రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రైవేట్ దళారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా, ఇంతవరకు వాస్తవ కొనుగోళ్లు ప్రారంభం కాలేదని రామారావు మండిపడ్డారు. అకాల వర్షాల భయం వెంటాడుతున్నా రైతులకు కనీసం టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. “ప్రభుత్వ పెద్దలు, ప్రైవేట్ దళారుల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందాల వల్లే ఈ జాప్యం జరుగుతోంది. రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకే దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది” అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే 60 శాతం ధాన్యం ప్రైవేట్ వ్యక్తుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తరుగు పేరుతో నిలువు దోపిడీ..
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు 5 కిలోల అదనపు ధాన్యాన్ని తరుగు పేరుతో తీసుకుంటున్నారని, మిల్లుల వద్ద కూడా బస్తాకు ఒకటి రెండు కిలోల కోత విధిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న రకాలకు ఇస్తామన్న రూ. 500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. అలాగే, సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు పంట కోతల సమయంలో విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
మే 30న రైతు మహాగర్జన – సమరభేరి..
వరితో పాటు పొద్దుతిరుగుడు, శనగ, మొక్కజొన్న పండించిన రైతులు కూడా మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరి కోసం అలుపెరగని పోరాటం చేస్తామని పోలాడి రామారావు స్పష్టం చేశారు. రైతుల పంట కోతలు పూర్తి కాకపోవడం, విద్యార్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకుని కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన ‘రైతు మహాగర్జన – సమరభేరి’ సభను మే 30వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ సభను సుమారు రెండు లక్షల మందితో రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రైతు ప్రజాసంఘాల నాయకులు జున్నుతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, విక్రమ సింహారావు, నగునూరి రాజేందర్, తీగల లక్ష్మణ్ రావు, కోడూరు సత్యనారాయణ, బోయినపల్లి శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర్ రావు, దాట్ల మోహన్, కొత్తకొండ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.











