సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్.
త్వరలో జరగబోయే జెడ్పిటిసి ఎన్నికలలో హుజురాబాద్ మండల ప్రాదేశిక ప్రాంతం నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్… బిజెపి… టిఆర్ఎస్.. పార్టీలకు చెందిన అనేకమంది నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా రంగంలోకి దిగడానికి సమాయత్తమవుతున్నారు. ఈనెల నాలుగో తేదీ బుధవారం రోజున జడ్పిటిసిల… ఎంపీటీసీల గడువు ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. తెలంగాణ యుగతులసి పార్టీ వ్యవస్థాపకులలో కీలకపాత్రదారుడు… కౌ ఫౌండేషన్ చైర్మన్… సామాజికవేత్త… రాజకీయ విశ్లేషకునిగా పేరు ప్రఖ్యాతులు గడించిన కాశెట్టి కుమార్ హుజురాబాద్ జడ్పిటిసిగా పోటీ చేయడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
బిజెపి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు బిజెపి నుండి టిక్కెట్ రావనట్లయితే
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన “సింహం” గుర్తుపై పోటి చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ విజయం కోసం కాశెట్టి కుమార్ రెండు నెలల పాటు తీవ్రంగా శ్రమించిన విషయం పాఠకులకు విధితమే. హుజురాబాద్ మండలం పరిధిలోని బొత్తలపల్లె గ్రామానికి చెందిన కాశెట్టి కుమార్ కౌ ఫౌండేషన్ ఛైర్మెన్ గా… యుగతులసి పార్టీ వ్యవస్థాపకులలో ప్రముఖుడిగా ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. బిజెపికి చెందిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తో ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉండటమే కాకుండా బిజెపిలో అనేకమంది కీలక నేతలతో కూడా కాశెట్టికి సాన్నిహిత్యం ఉంది. అలాగే కాంగ్రెస్… టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులతో కూడా ఆయనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా హుజురాబాద్ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయాలన్న సంకల్పంతో ఆయన అన్ని హంగులు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన కాశెట్టి కుమార్ కు హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాలలో గల అనేక బీసీ కుటుంబాలతో.. యువకులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్న విషయం విధితమే. ఇప్పటికే కాశెట్టి అనుచరులు మండలంలోని అనేక గ్రామాలలో పర్యటిస్తూ తమ నాయకుడు రాబోయే జెడ్పిటిసి ఎన్నికలలో రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం మొదలుపెట్టినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు… పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని… ఇకపై స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల రణ రంగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతున్నదని ఆదివారం సాయంత్రం హుజురాబాద్ పాత్రికేయ మిత్రులతో ఆయన మాట్లాడుతూ సర్పంచ్… ఎంపీటీసీ… జడ్పిటిసి తదితర పదవుల కాలపరమితి ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ రాజకీయ పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కాశెట్టి తెలిపారు. ప్రతి పదవికి అనుబంధంగా ఉప పదవులు… కోఆప్షన్ సభ్యులు ఉండటంవల్ల ఈ సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా 1,22,073 వరకు ఉందని… ఇంతమందిని కొత్తగా ఎన్నుకోవలసిన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో కొంత కాలయాపన జరిగినట్లయితే ఈలోగా సింగిల్ విండో చైర్మన్లు… మున్సిపల్ చైర్మన్ లు… కార్పొరేషన్ చైర్మన్లు కూడా తమ పదవీ కాలాన్ని ముగించుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వీరిని కూడా కలుపుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,37,587 మంది కొత్తవారిని తమ రాజకీయ ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుందని… ఓటు వేసే సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని… సమర్థులైన వ్యక్తులను గెలిపించినట్లయితే భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందన్న నగ్న సత్యాన్ని ప్రతి ఓటరు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆలోచించుకోవాలని కాశెట్టి కుమార్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ఐదు సంవత్సరాల క్రితం వివిధ సంస్థలకు జరిగిన ఎన్నికల గడువు దాదాపుగా గురువారం నాటితో ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇరవై రెండు వేల 73 రాజకీయ పోస్టులు ఖాలీ కాగా… వీటిని త్వరలో భర్తీ చేయవలసి ఉంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,814 మంది సర్పంచులు… 12,814 మంది ఉపసర్పంచులు… 88 వేల 682 మంది వార్డు సభ్యులు…606 మంది మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు…606 మంది మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు…606 మంది మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు.. .5817 మంది ఎంపీటీసీలు… 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు… 32 మంది జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు… 64 మంది జిల్లా పరిషత్ ల కో ఆప్షన్ సభ్యులు… తమ పదవీకాలం ముగియడంతో బాధ్యతల నుండి తప్పుకోవడం జరిగింది. వీరి స్థానంలో తెలంగాణ వ్యాప్తంగా 1 22073 మంది రాజకీయ నిరుద్యోగులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి ఖద్దరు చొక్కాలకు పదును పెట్టడం అప్పుడే ప్రారంభించినట్లు ఆయన తేలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ అనుకోకుండా అడ్డుపడకపోతే త్వరలోనే ఈ రాజకీయ ఖాళీలన్నింటిని త్వరితగతిన భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్నీ ఆయన గుర్తు చేసారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత మేరకు వెనక ముందు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి… మహిళలకు… నిరుద్యోగులకు… వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన హామీలను అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా నష్టపోతామనే భావన అధికార పార్టీలో నెలకొందని… రుణమాఫీ తర్వాత కొంత సమయం ఇచ్చి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకున్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నిక లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి అభిప్రాయమని కాశెట్టి కుమార్ తేలిపారు.
త్వరలో మరో 15,414 మంది రాజకీయ నాయకులు రిటైర్డ్?
మరో 980 మంది సింగిల్ విండో చైర్మన్లు… 980 మంది సింగిల్ విండో వైస్ చైర్మన్లు… 12 740 మంది సింగిల్ విండో డైరెక్టర్లు… 128 మంది మున్సిపల్ చైర్మన్లు… 128 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు… 384 మంది మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు… 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు… 37 మంది కార్పొరేషన్ వైస్ చైర్మన్లు 2025 ఫిబ్రవరి నాటికి పదవీచ్యుతులు కాబోతున్నరని… మొత్తంగా కలిపి చూస్తే 1,37,587 మంది తమ పదవుల నుండి వైదొలగనున్నారని కాశెట్టి వివరించారు.
“ఆణిముత్యాల” లాంటి యువతను గెలిపించండి
ఓటర్లకకు కాశెట్టి కుమార్ పిలుపు
ప్రజల ఆకాంక్షలకు… ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారికి… అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేసే యువతను రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించడానికి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాశెట్టి కుమార్ పిలుపునిచ్చారు. ఓటు అనే అస్త్రం ప్రయోగించడానికి ప్రతి ఒక్కరికి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం లభిస్తుందని… ప్రలోభాలకు లోనై అంది వచ్చిన చక్కటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే రాజకీయ వ్యవస్థలో ఆశించిన ఫలితాలు రాబోవు అన్న నగ్న సత్యాన్ని ప్రతి ఓటరు గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. గాంధీజీ కలలుగన్న గ్రామ సీమలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలన్నను… పల్లెలు అన్ని విధాలుగా కళకళలాడాలన్నను సరియైన నాయకుడిని మనం ఎంచుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఎవరికి ఓటు వేస్తే మన ఆశలు నెరవేరుతాయో… మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో ఒకటికి పదిసార్లు ఆలోచించి “ఆణిముత్యాల” లాంటి యువతను తమ ప్రతినిధులుగా ఎన్నుకోవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఎవరో వస్తారని… ఏదో చేస్తారని ఆశించకుండా… ఆత్మసాక్షిగా మనం తీసుకునే నిర్ణయమే అంతిమంగా మనను కాపాడుతుందనే విషయాన్ని ఓటర్లు గమనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక హామీలకు… తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోకుండా… ముందు చూపుతో ఓటు వేయాలని కాశెట్టి కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.










