బాహు బలంన్యూస్ కరీంనగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 10 : రక్తపిపాసి భూస్వామ్య వ్యవస్థను, దొరల గడీల అహంకారాన్ని పిడికిలెత్తి బద్దలు కొట్టిన తెలంగాణ పౌరుష ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గర్జించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ రహదారిలోని చాకలి ఐలమ్మ విగ్రహ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆమె వర్ధంతి కార్యక్రమంలో నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఓట్ల వేటలో విగ్రహ రాజకీయాలు – ఆశయాలకు పాతర
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ పాలక వర్గాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం’ దొరల గుండెల్లో నిద్రపోయిన ఐలమ్మ వీరత్వాన్ని నేటి పాలకులు కేవలం ఎన్నికల ఓట్ల వేటకే పరిమితం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వీరుల విగ్రహాలకు దండలు వేసి మొక్కుబడి నాటకాలు ఆడుతున్న నాయకులు, వారి ఆశయాలను మాత్రం బలిపీఠం ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు.
కొత్త రూపంలో కార్పొరేట్, పెత్తందారీ దోపిడీ
నాడు నిజాం రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చితే, నేడు కొత్త రూపంలో కార్పొరేట్ గద్దలు, అవినీతి పెత్తందార్లు సామాన్యులను నలిపివేస్తున్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాలు గడుస్తున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు బానిస బతుకులే మిగులుస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం అణగారిన వర్గాలు మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. హక్కులను ఎవరూ భిక్షగా వేయరని, ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే బరిలోకి దిగి లాక్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జంపాల నర్సయ్య, ప్రజా సంఘాల జిల్లా నాయకులు అండెం రమణారెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, గడ్డం కనకయ్య, బోయినపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










