బాహు బలంన్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 08:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్‌పై చేసిన అనుచిత, అమర్యాదకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హుజురాబాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్పీకర్ స్థానంలో ఉన్న ఒక దళిత బిడ్డను హేళన చేస్తూ మాట్లాడటం అంటే భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని మండిపడ్డారు. తాతా మధు వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుల అహంకారం స్పష్టంగా బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ‘దళిత బంధు’ అని ఊదరగొట్టి, ఆ తర్వాత దళితులనే కించపరచడం బీఆర్ఎస్ నిజస్వరూపమని ఎద్దేవా చేశారు.
ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి అత్యున్నత స్పీకర్ పదవికి ఎదిగిన నాయకుడిని గౌరవించాల్సింది పోయి, ఇలా అవమానించడం రాష్ట్రంలోని కోటి మంది దళితులను కించపరచడమేనని శ్రీనివాస్ అన్నారు. తాతా మధుతో పాటు కేసీఆర్, కేటీఆర్ రాబోయే 24 గంటల్లో బహిరంగంగా స్పీకర్‌కు, యావత్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే తాతా మధుపై బీఆర్ఎస్ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దొరల ఇళ్ల ముందు చావుడప్పు కొట్టి నిరసనలు ఉధృతం చేస్తామని, దళితుల ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు.










