బాహు బలంన్యూస్ కరీంనగర్, సెప్టెంబర్ 05 : ఎన్నికల వేళ రైతులకు, విద్యార్థులకు, వివిధ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర రెడ్డి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో భారీ నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
కరీంనగర్ పర్యటనకు వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను ఐకాస నాయకులతో కలిసి రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8న తలపెట్టిన నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలపాలని వినతిపత్రం అందజేయగా, అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
రూ. 9వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యాసంస్థలకు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు మెస్ ఛార్జీలు, స్కాలర్‌షిప్ నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, సాంకేతిక విద్యను అభ్యసించే గ్రామీణ పేద విద్యార్థుల ప్రయోజనార్థం పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
రెడ్డి కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు కేటాయించాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే రెడ్డి కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించి, పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర ఓసీ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు సైతం తగిన బడ్జెట్ కేటాయించి కార్యాచరణ ప్రారంభించాలన్నారు. రైతాంగానికి ఇచ్చిన రుణమాఫీ తదితర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎల్‌నినో ప్రభావంతో పొంచి ఉన్న కరవు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద చేపట్టే మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓసీలు, రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐకాస నాయకులు రెడ్డి సంపత్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, గన్ను నర్సింహారెడ్డి, వాల ప్రదీప్ రావు, రాజేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్, రమణారెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.










