బాహు బలంన్యూస్,హుజూరాబాద్, సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన శ్రేణులు ‘420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీలతో నినదిస్తూ, ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలతో కూడిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను పంపిణీ చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్న ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుళ్ల సాక్షిగా ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు మహిళలను పచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణమస్తు ద్వారా తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్ల పెంపు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేసి బాకీలు చెల్లించే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్‌రావు, పోల్నేని సత్యనారాయణరావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేశ్‌లతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












