బాహు బలంన్యూస్ కరీంనగర్, జూన్ 13 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ, రైతాంగ డిమాండ్ల సాధనకై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నేతృత్వంలో అన్నదాతలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యారు. ఆదివారం (జూన్ 14) సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ ఎస్సార్ఆర్ (SRR) ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ‘రైతుల మహాగర్జన సమరభేరి’ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసినట్లు ఆయన ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఐకాస రాష్ట్ర, జిల్లాల ప్రతినిధుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పోలాడి రామారావు స్వయంగా పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా, సభా నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డితో కలిసి పోలాడి రామారావు మాట్లాడుతూ.. ఈ మహాగర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా తరలివస్తున్నట్లు తెలిపారు. తాము ఇచ్చిన పిలుపుతో దాదాపు 2,500 బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో రైతులు కరీంనగర్ బాట పట్టారన్నారు. సభకు తరలివచ్చే జనసందోహానికి స్వాగతం పలుకుతూ 5 వేల మంది మహిళలతో కూడిన కోలాటాల బృందాలు, 2 వేల మంది డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆయన వివరించారు.
‘నభూతో నభవిష్యత్’ తరహాలో రామారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు.
దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో పోలాడి రామారావు ప్రత్యేక ప్రణాళికతో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా ఇరువైపులా భారీ కేడ్లను నిర్మించారు. సుదూర ప్రాంతాల వారికి సైతం స్పష్టంగా వినిపించేలా, కనిపించేలా అత్యాధునిక లౌడ్‌స్పీకర్లు, భారీ ఎల్‌ఈడీ (LED) తెరలను అమర్చారు. సభకు హాజరయ్యే జనసందోహం కోసం దాతల సహకారంతో లక్ష మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల పులిహోర పొట్లాలు, లక్ష మినరల్ వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు సందీప్ ఆధ్వర్యంలో 100 మంది సాంస్కృతిక బృందంతో ప్రత్యేక గేయాలాపన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
సభకు వచ్చే రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా కరీంనగర్ నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో రామారావు సూచనల మేరకు దాతల సహకారంతో ఉచిత భోజన, విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుండి వచ్చేవారికి కిట్స్ సింగాపూర్ వద్ద, కామారెడ్డి, సిరిసిల్ల రూట్ లో వచ్చేవారికి కొదురుపాక వద్ద, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల రైతుల కోసం ధర్మారం వద్ద వసతులు కల్పించారు. నిజామాబాద్, జగిత్యాల రూట్ లో వచ్చేవారికి గంగాధర క్రాస్ రోడ్డు వద్ద, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి రూట్ లో వచ్చేవారికి సుల్తానాబాద్ వద్ద, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట రూట్ లో వచ్చేవారికి శనిగరం వద్ద, అలాగే హుస్నాబాద్ రూట్ లో వచ్చేవారికి ఎల్కతుర్తి వద్ద మజ్జిగ, మంచినీరు, భోజన సౌకర్యాలు కల్పించారు. సభా ప్రాంగణంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు 800 మంది వాలంటీర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసార సౌకర్యం కల్పించారు. నగరానికి నలువైపులా 20 కిలోమీటర్ల మేర ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, అర్చీలను భారీగా అలంకరించారు.
రేవంత్ సర్కార్ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు.
సమీక్షా సమావేశంలో జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలైన పంటలకు ₹500 బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. రైతు కూలీలకు ₹12,000, కౌలు రైతులకు ₹15,000 ఇస్తామన్న ఊసే లేదన్నారు. రుణమాఫీని కూడా అరకొరగా చేసి రైతులను వదిలేశారని మండిపడ్డారు. ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. యాసంగి సీజన్ ముగిసినా కంటితుడుపుగా కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నవారికే దాదాపు ₹5,000 కోట్లు ఇచ్చి, మిగిలిన ₹4,000 కోట్ల భరోసా నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు సాగు పనుల్లో ముమ్మరంగా ఉన్నా.. రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం అన్నదాతల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్లకు కక్కుర్తి పడి, ప్రైవేట్ దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను 40 రోజులు ఆలస్యం చేయడం వల్లే రైతులు రోడ్డున పడ్డారని రామారావు మండిపడ్డారు. తరుగు, రవాణా పేరుతో రైతులు దాదాపు ₹1,200 కోట్ల మేర నిలువు దోపిడీకి గురయ్యారని, దీనికి పౌరసరఫరాల శాఖే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎరువుల పంపిణీలో ‘యాప్’ల పేరుతో రైతులను దగా చేస్తున్నారని, ‘డిస్కీమ్’ల నెపంతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ రంగంలో జవాబుదారీతనం లోపించి సామాన్యులు ఇక్కట్ల పాలవుతున్నారని, వ్యవసాయ సహకార రంగంలో నామినేటెడ్ పద్ధతులు తీసుకురావడం దారుణమన్నారు. నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పూర్తిగా మూలన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగమే కాకుండా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆపేశారని, నిరుద్యోగుల ఉపాధి హామీలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదని దుయ్యబట్టారు.
‘వెనక్కి తగ్గేదే లేదు.. ప్రశ్నించే నిఖారసైన గొంతుకగా నిలుస్తాం’
ప్రస్తుత ప్రతిపక్షాలు నామ్‌కే వాస్తేగా, నిస్తేజంగా మారిపోయాయని.. తాము మాత్రం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోకుండా ప్రశ్నించే నిఖారసైన గొంతుకగా నిలుస్తామని పోలాడి రామారావు స్పష్టం చేశారు. ప్రభుత్వం సభ నిర్వాహకులపై, బస్సులు ఇచ్చిన రవాణా యాజమాన్యాలపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు గురిచేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
రాజకీయాలకతీతంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ ‘రైతు మహాగర్జన’ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అంచనాలకు మించి రెండు లక్షలకు పైగా జనాభాతో నిర్వహించబోయే ఈ చారిత్రాత్మక సమరభేరి సభకు వివిధ వర్గాల ప్రజలు, రైతులు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పోలాడి రామారావు సగర్వంగా పిలుపునిచ్చారు.










