బాహు బలంన్యూస్ హుజూరాబాద్, మార్చి 15:
రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజా సంఘాల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముచ్చా సమ్మిరెడ్డి హుజూరాబాద్‌లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అనూహ్య స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ఈ దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరుకోవడంతో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రైతు సంఘాల నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ, అన్నదాతల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మరో 15 రోజుల్లో పంటలు కోతకు వచ్చే దశకు చేరుకున్నా, నేటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ విమర్శించారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తూ కాలయాపన చేయడం సరికాదని, అన్ని రకాల ధాన్యాలకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని వారు ఆరోపించారు.
రైతుల ప్రధాన డిమాండ్లు.
దీక్షా శిబిరం వేదికగా పోలాడి రామారావు ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు.
50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ కల్పించాలి.
రైతుల ఆరోగ్య భద్రత కోసం 20 లక్షల రూపాయల పరిమితితో హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలి.
ఓసి సంక్షేమ కార్పొరేషన్లకు తక్షణమే పాలక మండళ్లను నియమించి, 3,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి.
ఉద్యమ కార్యాచరణ:అసెంబ్లీ ముట్టడికి పిలుపు
రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయని పక్షంలో, ఈనెల 16వ తేదీన వేలాది మంది రైతులతో శాంతియుతంగా అసెంబ్లీ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామని రామారావు హెచ్చరించారు. అంతేకాకుండా, ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్ష మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన’ సమరభేరి సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
దీక్ష విరమణ..
రెండు రోజుల పాటు సాగిన ముచ్చా సమ్మిరెడ్డి దీక్షను పోలాడి రామారావు మరియు జేఏసీ కన్వీనర్ తణుకు సమ్మయ్యలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ, తన పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్రాజం, సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండాల రెడ్డి, కౌన్సిలర్ కాసిరెడ్డి నర్సింహా రెడ్డి, సర్పంచ్ పోల్సాని రామారావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, డీటీఎఫ్ నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, సామాజిక కార్యకర్త అకినేపెళ్లి శిరీష, టీడీపీ నాయకుడు ఎస్కే ఫయాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.












