బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి 14 :
దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతను నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని వారు ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వారు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్, జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంట, శంకరపట్నం సహా పలు మండలాల నుండి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదల విషయంలో అనవసర జాప్యం చేస్తోందని పోలాడి రామారావు మండిపడ్డారు. రైతు భరోసా కోసం సేకరించిన రూ. 9,000 కోట్ల నిధులలో దాదాపు రూ. 4,000 కోట్లను కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్ల చెల్లింపులకు మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇది రైతు ద్రోహమేనని ఆయన పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో పంటలు కోతకు వస్తున్న తరుణంలో, ఇప్పటికీ పెట్టుబడి సాయం అందకపోతే రైతులు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నెల 16వ తేదీ లోపు రైతు భరోసా నిధులు విడుదల చేయని పక్షంలో, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు.
వ్యవసాయ సంక్షోభం – పాలకుల వైఫల్యం
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ (వాటర్ మేనేజ్‌మెంట్) దారుణంగా ఉందని, పంటలకు నీళ్లు అందక రైతులు విలవిలలాడుతుంటే పాలకులకు కనీస ‘సోయి’ లేకపోవడం విచారకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను చూసి మన పాలకులు నేర్చుకోవాలని, అవసరమైతే అధికారులను అక్కడికి పంపి స్టడీ చేయించాలని రామారావు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఆమోదయోగ్యంగా లేవని, రైతే తన పంట ధరను నిర్ణయించుకునేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కూలీల కొరతను దృష్టిలో ఉంచుకుని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సామాజిక భద్రత కోసం రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 6,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా, రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, నిధులు లేక వెలవెలబోతున్న ఓసీ కార్పొరేషన్లకు తక్షణమే బడ్జెట్ కేటాయించి పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్ష మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ నిర్వహించనున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా సాగే ఈ సభ ద్వారా పాలకుల వైఫల్యాలను ఎండగడతామని, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.











