బాహు బలంన్యూస్ జమ్మికుంట, సెప్టెంబర్ 3: బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో బుధవారం రోజున జమ్మికుంట మండల నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, మండల అధ్యక్షుడిగా తూర్పాటి సాయిలు, ప్రధాన కార్యదర్శిగా రేవెల్లి సాయన్న ఎన్నికయ్యారు.
అదే విధంగా జమ్మికుంట టౌన్ అధ్యక్షుడిగా తూర్పాటి శివ, ఉపాధ్యక్షులుగా తూర్పాటి శంకర్, టౌన్ ప్రధాన కార్యదర్శిగా చేర్ల కుమార్, టౌన్ కోశాధికారిగా పత్తి పాపారావు, టౌన్ ఆర్గనైజర్‌గా తూర్పాటి రాజు, టౌన్ జాయింట్ సెక్రెటరీగా పర్సనల్ సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా తూర్పాటి సారయ్య, తూర్పాటి ఎల్లయ్య, తూర్పాటి మారయ్య, మూర్తి రాజయ్య, మరియు తూర్పాటి లక్ష్మణ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు, ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, ఈ పథకంలో బేడ బుడగ జంగం కులస్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 2000 కుటుంబాలకు కేవలం 14 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. గ్రామీణ, మున్సిపాలిటీ ఇందిరమ్మ కమిటీలలో సభ్యులుగా లేకపోవడం వల్ల ఈ అన్యాయం జరిగిందని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వాన్ని కోరిన ప్రధాన డిమాండ్లు:
గృహ నిర్మాణం: ప్రస్తుతం 80% మంది పూరి గుడిసెల్లో నివసిస్తున్నందున, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో 10,000 ఇళ్లను పైలట్ ప్రాజెక్టు కింద కేటాయించాలని కోరారు. అదేవిధంగా, డబుల్ బెడ్‌రూమ్ పథకంలో మరో 10,000 ఇళ్లను కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు.
జనగణన, రిజర్వేషన్లు: 2011 జనాభా లెక్కల ప్రకారం తమ జనాభా 1,17,100 ఉన్నప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రాల సమస్యల కారణంగా సంఖ్య తక్కువగా కనిపించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో తమ జనాభా 6 లక్షలకు పైగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-ఎలోని 15 కులాలకు ఉపకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తమ కులానికి చైర్మన్ పదవిని, ఏటా రూ. 5000 కోట్లతో నిధిని కేటాయించాలని కోరారు.
ఆత్మగౌరవ భవనం, ఆలయం: తమ కులస్థులు హైదరాబాద్‌లో వివిధ పనుల కోసం వచ్చి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, 1000 గజాల స్థలం కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించాలని కోరారు. అలాగే, కరీంనగర్ జిల్లాలో ఐదు ఎకరాల స్థలం కేటాయించి కులదైవం పెద్ద గుసై తాత గుడిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సిరిపాటి వేణు ప్రభుత్వానికి హెచ్చరించారు















