విద్యార్థుల వరుస మరణాలు, అస్వస్థతలపై ధర్మ సమాజ్ పార్టీ తీవ్ర ఆగ్రహం: ‘ప్రభుత్వ హత్యలే’ అంటూ నిప్పులు చెరిగిన మంద రాజ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ , జూలై 18: తెలంగాణలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు, గురుకులాల్లో చోటుచేసుకుంటున్న ఆహార విషాద ఘటనలపై ధర్మ సమాజ్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈ దుర్ఘటనలకు కారణమని ఆ పార్టీ మండల్ కన్వీనర్ మంద రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాలకుల సవతి తల్లి ప్రేమ విద్యార్థుల అమూల్యమైన ప్రాణాలను బలిగొంటుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని మంద రాజ్ గట్టిగా డిమాండ్ చేశారు. “విద్యార్థుల ఆత్మహత్యలు కేవలం ఆత్మహత్యలు కావు, అవి ప్రభుత్వ హత్యలే” అని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఐదవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల ఊరబావి సంధ్య అనే విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంధ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
ఈ విషాద ఘటన మరువక ముందే, రాష్ట్రంలోని గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఒకే రోజు 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన ఆశ్రమం బాలికల పాఠశాలలో రాత్రి భోజనం అనంతరం 35 మంది విద్యార్థులు కడుపునొప్పితో విలవిలలాడారు. అలాగే, మర్రిగూడలోని ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో 18 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా, జగిత్యాల జిల్లా రూరల్ మండల్ లక్ష్మీపురం గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం సాయంత్రం విద్యార్థులకు బగారా అన్నంతో పాటు చికెన్ వడ్డించగా, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరికొందరు విద్యార్థినులు కూడా అనారోగ్యం పాలైనట్లు సమాచారం.
“ఇన్ని దారుణ ఘటనలు నిత్యం జరుగుతున్నా, ఈ ‘రెడ్ల ప్రభుత్వం’ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది” అని మంద రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏంటో స్పష్టం చేస్తోందని, పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఎద్దేవా చేశారు.
పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తక్షణమే రంగంలోకి దిగాలని, తెలంగాణలోని అన్ని హాస్టళ్లను పర్యవేక్షించి, ప్రత్యేక అధికారులను నియమించి తగిన చర్యలు తీసుకోవాలని మంద రాజ్ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని మంద రాజ్ హెచ్చరించారు. ఈ ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !