బాహు బలంన్యూస్ హుజురాబాద్:, జూలై 15: శంకరపట్నం మండలం, మొలంగూర్ (గుడాటిపల్లె) గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భూ వివాదాల నేపథ్యంలో గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
శ్రీధర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, 2006లో గుర్రం కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి తమ తండ్రి పెద్ద మల్లారెడ్డికి సర్వే నెం. 231లో 8 గుంటల భూమిని విక్రయించారు. 2023లో శ్రీధర్ రెడ్డి తన పేరు మీద 4 గుంటలు, తన అన్నయ్య తిరుపతి రెడ్డి పేరు మీద 4 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గ్రామ పంచాయతీ నుండి అన్ని అనుమతులు పొంది, దాదాపు రూ. 15 లక్షలు ఖర్చు చేసి స్లాబ్ స్థాయి వరకు ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు కిషన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి కూడా హాజరయ్యారు.
అయితే, వారి కుమారులు రాజేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పలు కోర్టు కేసులతో మానసిక వేదనకు గురి చేశారని, అన్ని తీర్పులు తమకు అనుకూలంగా వచ్చినా, బెదిరింపులు కొనసాగడంతో ఆ ఇంటిని అక్కడే వదిలేసి, ఎలాంటి వివాదాలు లేని తమ స్వంత భూమి సర్వే నెం. 239B/1లో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నామని తెలిపారు.
అయినప్పటికీ, గుర్రం సంజీవ్ రెడ్డి, కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు తమపై పగ పెంచుకొని, తమ వ్యవసాయ బావిని పూడ్చివేసి, ఆరు గుంటల భూమిని అమ్మివేయాలని బెదిరిస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి వెనుక వారికి రోడ్ ఫేస్ లభించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శంకరపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్‌కు వారి పొలంలోని ఖనీలను తమ పొలంలో పడేసి ఫిర్యాదు చేశారని, హుజురాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు తమపై దాడి చేశారని తప్పుడు కేసులు పెట్టారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ విధంగా రకరకాలుగా అక్రమ కేసులు పెడుతూ, ఎలాగైనా భూమిని అమ్మించాలని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. వారి నుండి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, దీనిపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని శ్రీధర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.











