బాహు బలంన్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ: దేశం మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా కాకుండా, జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. సహకార ఫెడరలిజం శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్తో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మాడల్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేపట్టిన అనేకానేక కార్యక్రమాలను సమగ్రంగా వివరించి, అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
పహల్గామ్ ఘటన ఖండన, ఇందిరా గాంధీకి వందనాలు
దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఆర్థిక, పాలనాపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ వేదిక నుంచి మాట్లాడటం గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానంటూ ముఖ్యమంత్రి గారు ముందుగా పహల్గామ్ ఘటనను తీవ్రంగా ఖండించారు. “పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ సాయుధ దళాలు చేపట్టిన ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. దేశంలో శాంతి, ఐక్యతను కాపాడుకోవాలన్న సంకల్పానికి తెలంగాణ కట్టుబడి ఉంది. మన వీరుల ధైర్యానికి, త్యాగాలకు వందనాలు. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో దేశానికి చిరస్మరణీయ విజయం అందించిన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సముచితం” అని అన్నారు.
వికసిత్ భారత్‌లో తెలంగాణ పాత్ర
దేశ స్వాతంత్రం సాధించి వందేళ్లయ్యే 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో కూడిన వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం మనకుందని, ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో ముందువరుసలో నడవడానికి కీలక పాత్ర పోషించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
దేశం రాష్ట్రాల సమాఖ్య అని, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరమని, అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని కేంద్రం అందించాలని కోరారు. రాష్ట్రాల మధ్య సమతుల్యత చాలా కీలకమని ఆయన ఉద్ఘాటించారు.
తెలంగాణ రైజింగ్ 2047 – ఆకాంక్షలు, లక్ష్యాలు
వికసిత్ భారత్‌కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం తరఫున, ప్రజల తరఫున తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో కార్యాచరణ పథకాన్ని సమర్పించారు. తమ ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబిస్తుందని, సంకల్పించిన సాహసోపేతమైన మార్పును సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. ఈ విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలని ఆకాంక్షించారు.
వన్ ట్రిలియన్ డాలర్ల GSDP లక్ష్యం
వన్ ట్రిలియన్ డాలర్ల GSDP సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి వెల్లడించారు. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నామని, అయితే ఈ ప్రయాణాన్ని వేగవంతం చేసి పదేళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉందని వివరించారు.
2047 నాటికి జాతీయ జీడీపీకి తెలంగాణ 8 శాతం, అంటే 2.4 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసి తెలంగాణ జాతీయ లక్ష్యాలకు చోదకంగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో ఇప్పటికే పారిశ్రామిక, సాంకేతిక, పరిపాలనా సంస్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.9 శాతంగా మాత్రమే ఉందని, ఆర్థిక సహకారం అందించడంలో తెలంగాణ వాటాను గణనీయంగా పెంచాలని కోరారు. భారత యూనియన్‌లో అత్యంత డైనమిక్, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, స్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.
మహా నగరాల అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్
దేశంలోని 6 మహా నగరాలైన ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ల పట్టణ జీడీపీలో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ముంబయి, ఢిల్లీ లాంటి నగరాలతో పోల్చితే పరిమాణంలో చిన్నదైనప్పటికీ హైదరాబాద్ ఇప్పటికే GDPలో సుమారు 2.5 శాతం సమకూర్చుతోందన్నారు. ఆర్థిక, ప్రతిభ, పెట్టుబడి, సాంకేతిక పురోగతి కేంద్రాలుగా ఉన్న ఈ మహా నగరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
ఈ టాస్క్‌ఫోర్స్ ఆయా నగరాల్లో ప్రత్యేక సమగ్ర పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు, పాలన సంస్కరణలపై ప్రత్యేకమైన వ్యూహం ఉండాలని సూచించారు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఊపును తీసుకురావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో, ప్రపంచ పట్టణ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా, యువత, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు
తెలంగాణ రైజింగ్ 2047 లో మహిళా సాధికారత కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. మహిళల సంఘాలకు పెట్టుబడులు సమకూర్చడం వలన వారి కుటుంబాలు, సంఘాలు, ఆర్థిక వ్యవస్థలో మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోందన్నారు. మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థికాభివృద్ధిని దన్నుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం **’ఇందిరా మహిళా శక్తి మిషన్’**ను ప్రారంభించిందని తెలిపారు.
యువత సాధికారితపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యువతను సమర్థమైన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, పోలీస్ పాఠశాల, ఏటీసీలు, పరిశ్రమలతో అనుసంధానమైన నైపుణ్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాదిలోనే 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కీలక మైలురాయిని చేరుకుందని వివరించారు.
వాతావరణ మార్పులతో గత పదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విధాన ఎజెండాలో ముందు వరుసలో ఉంచిందని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న ధాన్యానికి కింటాకు రూ. 500 ప్రోత్సాహకం, 5 లక్షల మేరకు బీమా అందిస్తున్నామని, గిరిజన రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’ పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి వివరించారు.
సామాజిక న్యాయం, కులగణన
సుదీర్ఘకాలంగా ఉన్న అసమానతనలు తొలగించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టిందని, ఇది తెలంగాణ సాధించిన మరో ఘనతను పంచుకోవడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. ఈ సర్వే తెలంగాణకు ఎక్స్-రే వంటిదని, ఈ చారిత్రాత్మక చర్యకు గుర్తింపుగా, 2024, ఫిబ్రవరి 4న **’సామాజిక న్యాయ దినం’**గా ప్రకటించామన్నారు. ఇందుకు సంబంధించి రెండు బిల్లులను భారత రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు.
ఇది తెలంగాణలో సామాజిక న్యాయం, సమ్రగత సాధనలో కీలక ఘట్టమని, కచ్చితమైన, భారీ డేటా సేకరణ, సమ్మిళిత విధాన రూపకల్పన, సామాజిక న్యాయానికి పునాదిగా ఎలా ఉపయోగపడుతుందో చూపడం ద్వారా తెలంగాణ దేశానికి నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలనే నిర్ణయానికి తమ శాసనసభ తీర్మానం ప్రేరణనివ్వడం గర్వకారణమని అన్నారు.
ఎస్సీ ఉప వర్గీకరణను సమర్థిస్తూ గౌరవ సుప్రీంకోర్టు 2024, ఆగస్టు 1న చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ ఉప వర్గీకరణపై పరిశీలన చేసి సిఫార్సులు చేయాలని జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరామని, సమగ్ర విశ్లేషణ అనంతరం కమిషన్ ఎస్సీల్లోని 59 కులాలను మూడు వర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసిందని వివరించారు.
పారిశ్రామికాభివృద్ధి, భవిష్యత్ నగరాలు
మారుతున్న కాలానుగుణంగా ఆర్థిక ప్రగతి పథం వైపు నడిపించడానికి తెలంగాణ పారిశ్రామిక రంగం పురోగతికి ప్రగతిశీల విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కేంద్రీకృత నైపుణాభివృద్ధి వంటి అంశాలతో వ్యూహాత్మక పారిశ్రామికీకరణ ఎజెండాను అనుసరిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం తమదైన ఆర్థిక వ్యవస్థలతో పూర్తి పట్టణ (కోర్ అర్బన్)-పాక్షిక పట్టణ (సెమీ అర్బన్), గ్రామీణ ప్రాంతాలుగా విభజించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీని లేదా భారత్ ఫ్యూచర్ సిటీని భారతదేశపు మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. భిన్న రంగాలు, స్థిరమైన పట్టణ-పారిశ్రామిక కేంద్రంగా 30 వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ నగరం నిర్మితమవుతోందని, 15 లక్షల మందికి నివాసం, 7.5 లక్షల మందికి ఉపాధిని కల్పించేలా రూపొందుతోందని వివరించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీ, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ జోన్, EV మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ESS) జోన్, రెసిడెన్షియల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్స్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ, ఎడ్యుకేషనల్ హబ్ మరియు డేటా హబ్ వంటి ప్రత్యేక జోన్లు ఉంటాయని ఆయన తెలిపారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాల్లో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోందని, ఈ విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. 2024–25 (AE) ఆర్థిక సంవత్సరంలో, సేవల రంగం తెలంగాణ GSVA లో 66 శాతం వాటాను అందించింది.
మహిళా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరియు సమ్మిళిత సాంకేతికత సాధికారత లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోందని, అలాగే పర్యావరణ హిత మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025 తీసుకొచ్చామని, విద్యుత్ వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యంతో వాటిపై వంద శాతం రోడ్డు పన్ను మినహాయించామని తెలిపారు. 2030 నాటికి రాష్ట్రంలో 6 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లు, 2035 నాటికి 12 వేల స్టేషన్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించామని ఆయన వివరించారు.
మౌలిక సదుపాయాలు, కీలక ప్రాజెక్టులు
రాష్ట్ర భవిష్యత్తును మార్చగల దార్శనిక పట్టణ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ప్రాంతీయ రింగ్ రోడ్ ఇందులో ఉన్నాయని, అనుసంధానతను (కనెక్టవిటీ) మెరుగుపర్చడం, రాకపోకలను (ప్రయాణాలు) ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధికి కొత్త జోన్‌లను తెరవడమే ఈ పనుల లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల వృద్ధికి గణనీయంగా దోహదపడే ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం నిర్మాణాత్మక మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
దక్షిణ తెలంగాణలోని కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జీవనాడి అని సీఎం తెలిపారు. ఈ పథకం 1,226 గ్రామాల తాగునీటి అవసరాలను, 12.36 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతిని కల్పిస్తుందన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు CWC ఇవ్వాలని, పథకానికి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
స్థిరమైన, సమ్మిళిత పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ఒక నమూనాగా అవతరించిందని, గత రెండు సంవత్సరాల్లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ద్వారా 52 వేల పైచిలుకు ఉద్యోగాలను కల్పించే రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ముఖ్యమంత్రి వివరించారు.
దాదాపు వందకు పైగా అంశాలతో తెలంగాణ రైజింగ్ ఎజెండాను సమగ్రంగా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం, సమన్వయం ఉండాలని ఆకాంక్షించారు. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తెలంగాణ సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.












