తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC), డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మూడేళ్ల విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుందని, 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్‌పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.
జీసీసీ హబ్‌గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని సీఎం అన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందని, హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో టవర్లు, పోల్స్, లైన్స్ ఏవీ బహిరంగంగా కనిపించకుండా పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలని చెప్పారు. 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు పొడవునా సోలార్ విద్యుత్ వినియోగించుకునే ప్రణాళిక ఉండాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !