కాశ్మీర్ ఉగ్రదాడిపై బేడ బుడగ జంగం జన సంఘం నిరసన.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి
జమ్మికుంట ఏప్రిల్ 28: కాశ్మీర్‌లోని పాల్గంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంతాపంగా బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిరిపాటి వేణు మాట్లాడుతూ, కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు హిందూ, ముస్లిం అని అడిగి మరీ 27 మందిని కాల్చి చంపడం అత్యంత హేయమైన చర్య అని ఆయన అన్నారు. కాశ్మీర్ అందాలను చూడటానికి వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి పర్యాటకులు వస్తున్నారని తెలిసి కూడా ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌కు దీటైన జవాబు ఇవ్వాలని, భారత దేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన కోరారు. అంతేకాకుండా, కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు అధికారం కోసం దేశంలో మత, కుల సమస్యలు సృష్టిస్తున్న తీరును ఆయన విమర్శించారు. కాశ్మీర్‌లో 26 మంది హిందువులను ఉగ్రవాదులు చంపితే, దేశంలోని ముస్లిం సోదరులు వివిధ రూపాల్లో నిరసన తెలపడం అభినందనీయమని ఆయన అన్నారు. దేశంపై ఏ దేశ ఉగ్రవాదులు దాడి చేసినా, భారతీయులందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశంలో హిందూ, ముస్లిం సోదరులు ప్రేమగా, ఆప్యాయంగా జీవిస్తుంటే, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వానరాశి జాన్, తూర్పాటి పోచాలు, తూర్పాటి మారయ్య, తూర్పాటి జంపయ్య, తూర్పాటి శంకర్, సమ్మయ్య, రవి, సాంబయ్య, పత్తి పాపారావు, పర్వతం కనకయ్య, పర్వతం రాజేష్, రావుల సమ్మయ్య, రేవెల్లి నివాస్ తదితరులు పాల్గొన్నారు. చివరగా “పాకిస్తాన్ డౌన్ డౌన్”, “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !