బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, జూన్ 13: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రమూకలు జరిపిన దాడిని ఖండిస్తూ బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కుల,మత, ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశంలో మతం పేరుతో మారణహోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేయడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు.
ఉగ్రమూకల దాడిలో ఆగిన ప్రతి ఊపిరి భారతీయుల్లో ఉద్రేకాన్ని రగిలించిందని కృష్ణారెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ దాడి క్రూరమైన, హేయమైన, అమానవీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మతం పేరుతో దాడులకు తెగబడిన ఉగ్రమూకల చెడ్డ ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కావని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల చర్యలకు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందని, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, భారతదేశం ఎవరికీ తలవంచదని, ధైర్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, కౌన్సిలర్ వెంకటరెడ్డి, నల్ల సుమన్, చైతన్య శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంతటి వాసు, గంట సంపత్, నరాల రాజశేఖర్, కొలిపాక వెంకటేష్, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, భూత్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
