బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,ఏప్రిల్ 23: హుజూరాబాద్ పట్టణంలోని 6వ వార్డు, న్యూ శాతవాహన హైస్కూల్ ఎదురుగా ఉన్న మురుగు కాలువ చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన మురుగు నీటితో దోమలు విజృంభి స్తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్ పీఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది రోజులుగా మురుగు కాలువలో చెత్త పేరుకుపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
మురుగు కాలువను శుభ్రం చేయకపోతే కాలనీలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు
