బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 23: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) రాష్ట్ర శాఖ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షులు కట్టా నాగభూషణాచారి పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నూతన పీఆర్సీని జూలై 2023 నుండి అమలు చేసి, బకాయిల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కోరారు.
ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటిని సక్రమంగా నిర్వహించాలని, పెన్షనర్లకు నాణ్యమైన వైద్యం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డులపై గరిష్ట పరిమితి లేకుండా అన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లందరికీ ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ 20 లక్షలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టా ప్ర రాష్ట్ర శాఖ నిర్వహించనున్న ధర్నాలో రాష్ట్రం నలుమూలల నుండి పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
